Wednesday, 21 September 2016

Chapter 1

శ్రీ సాయి సత్ చరిత్రము
మొదటి అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 1

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

మొదటి అధ్యాయము

గురు దేవతా స్తుతి – బాబా గోధుమలు పిండి విసిరిన కథ – దాని తత్త్వము. పూర్వసంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయిసత్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు.

ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి యీ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తూ శ్రీగణేశుడని చెప్పుచున్నారు.

పిమ్మట శ్రీసరస్వతీదేవిని స్మరించి యామె తననీ గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు, శ్రీసాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు.

తదుపరి సృష్టిస్థితిలయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్ధించి, శ్రీసాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు, వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు.

తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి, వారు కొంకణదేశములో వెలసిరనియు, ఆభూమి పరశురాముడు సముద్రమునుండి సంపాదించినదనియు చెప్పుచు, వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి.

అటుపిమ్మట వారి గోత్రఋషియగు భరద్వాజమునిని స్మరించెను. అంతేగాక, యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకసనందనాదులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైముని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొ||న పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్ధనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారామ్, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడ ప్రార్థించెను.

తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనమునుండి పెంచి పెద్దచేసిన మేనత్తకు, తన జ్యేష్ఠసోదరునకు నమస్కరించెను.

అటుపైన పాఠకులకు నమస్కరించి, తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్ధించెను.

చివరగా తన గురువు, దత్తావతారమును అగు శ్రీసాయిబాబాకు నమస్కరించి, తాను వారిపై పూర్తిగా నాధారపడి యున్నానని చెప్పుచు, ఈ ప్రపంచము మిథ్యయనియు, బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు, నీ ప్రపంచములో నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికిని నమస్కరించెను.

పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట, హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను.

1910 సం|| తదుపరి యొకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో నున్న శ్రీసాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి యాశ్చర్యపడితిని. బాబా ముఖప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనె పరచి, దానిపై తిరుగలి యుంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసికొని, కఫనీ (చొక్కా) చేతులు పైకి మడచి, పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, “ఈ గోధుమపిండిని బాబా యేమిచేయును? ఆయనెందుకు గోధుమలు విసరుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే! వారికి గోధుమపిండితో నేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే!” యని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడ నిట్లే యాశ్చర్యమగ్నులయిరి. కాని మాలోనెవరికి గూడ బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి, వారే విసరుట ప్రారంభించిరి. వారు తిరుగలిపిడిని చేతపట్టుకొని, బాబా లీలలను పాడుచు విసరుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కాని, వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిఱునవ్వు నవ్విరి. విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి. “బాబాకు ఇల్లుపిల్లలు లేరు. ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడినవారు, ఆయన పోషించవలసిన వారెవరును లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసికొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమపిండితో నేమిపని? బాబా మిగుల దయార్ద్రహృదయుడగుటచే మనకీ పిండిని పంచిపెట్టును కాబోలు.” ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసరుట ముగించి, పిండిని నాలుగు భాగములు చేసి యొక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసికొనుచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు నిట్లనెను.

“ఓ వనితలారా! మీకు పిచ్చి పట్టినదా యేమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? ఏ కారణముచేత పిండిని గొంపోవుటకు యత్నంచుచున్నారు? సరే, యిట్లు చేయుడు. పిండిని తీసికొనిపోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు.” అది విని యా వనిత లాశ్చర్యమగ్నలయిరి, సిగ్గుపడిరి, గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా యాజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి.

నేనిదంతయు జూచి, షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరా జాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసరినవి గోధుమలు కావనియు, వారు కలరా జాడ్యమును విసరి ఊరికవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరు ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూడార్ధమును తెలిసికొన కుతూహలము కలిగెను. గోధుమపిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొకదానినెట్లు శాంతింపజేసెను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక యీ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలయునని నిశ్చయించుకొంటిని. ఈ లీలలను జూచి యిట్లు భావించుకొని హృదయానందపూరితుడనయితిని. ఈ ప్రకారముగా బాబా సత్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంధము నిర్విఘ్నముగను, జయప్రదముగను పూర్తియైనది.

తిరగలి విసురుట – దాని వేదాంత తత్త్వము

తిరుగలి విసరుటను గూర్చి షిరిడీ ప్రజలనుకొనురీతియే కాక దానిలో వేదాంత భావము కూడ కలదు. సాయిబాబా షిరిడీ యందు షుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచునే యుండురి! నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ; మీదిరాయి భక్తి; చేతిలో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని, ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచి వేయవలయును. అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును.

ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ యొకతె తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు యేడ్వసాగెను. నిపతినిరంజనుడను యొక సాధుపుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను: “నేను కూడ ఆ ధాన్యమువలె ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా?” దానికి నిపతినిరంజనుడిట్లు బదులు చెప్పెను:

“భయములేదు! తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము. అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు.”

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
మొదటి అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

Chapter 2

శ్రీ సాయి సత్ చరిత్రము
రెండవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 2

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

రెండవ అధ్యాయము

ఈ గ్రంథరచనకు కారణము, పూనుకొనుటకు అసమర్ధతయు ధైర్యము; గొప్పవివాదము; హేమడ్ పంతు అను బిరుదు ప్రదానము; గురువుయొక్క యావశ్యకత.

ఈ గ్రంధరచనకు ముఖ్యకారణము

మొదటి యధ్యాయములో గోధుమలను విసరి యా పిండిని ఊరిబయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదేగాక శ్రీసాయి యొక్క యితర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింతలీలలును చర్యలును మనస్సున కానందము కలుగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములను బోగొట్టును గదా యని భావించి బాబాయొక్క పవిత్ర జీవితమును, వారి బోధలును వ్రాయ మొదలిడితిని. యోగీశ్వరుని జీవితచరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యము, ఆధ్యాత్మికమునైన మార్గమును జూపును.

పూనుకొనుటకు అసమర్థతయు, ధైర్యము

ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థతగలవాడను కానని హేమడ్ పంతు అనుకొనెను. అతడిట్లనియెను. "నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవితచరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో యోగీశ్వరుని నెట్లు వర్ణించగలరు? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగియయిగాని యోగి యొక్క జీవితమును గ్రహించ జాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను. సప్తసముద్రముల లోతును గొలువవచ్చును. ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కాని యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహుకష్టము. ఇది గొప్ప సాహసకృత్యమని నాకు తెలియును. నలుగురు నవ్వునట్లు అగుదునేమోయని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహముకొరకు ప్రార్థించితిని."

మహారాష్ట్రదేశములోని మొట్టమొదటికవియు, యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వరమహారాజు యోగులచరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలను నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగు లనేక మార్గముల నవలంబించెదరు. యోగులే యట్టిపనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారివారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శ క సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతని ప్రోత్సాహించి, కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శ క సంవత్సరములో దాసగణుయొక్క సేవను ఆమోదించిరి. మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను. అవి భక్తవిజయము, సంతవిజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనునవి. దాసగణు వ్రాసినవి భక్తలీలామృతమును సంతకథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీనియందు గలవు. భక్తలీలామృతములోని 31, 32, 33, అధ్యాయములందును, సంతకథామృతములోని 57వ యధ్యాయమందును సాయిబాబా జీవితచరిత్రయు, వారి బోధలును చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక, సంచికలు 11, 12 సంపుటము 17 నందు ప్రచురితము. చదువరులు ఈ యధ్యాయములు కూడ పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుతలీలలు బాంద్రా నివాసియగు సావిత్రి బాయి రఘునాథ్ తెండుల్కర్ చే చక్కని చిన్న పుస్తకములో వర్ణింవబడినవి. దాసగణు మహారాజుగారు కూడ శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు. గుజరాత్ భాషలో అమిదాసు భవాని మెహతా యను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థవారు ప్రచురించియున్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సత్చరిత్ర వ్రాయుటకు కారణమేమైయుండును? దాని యవసరమేమి? యని ప్రశ్నింపవచ్చును.

దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రమువలె విశాలమైనది; లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తి జ్ఞానములను మణులను తీసి కావలసిన వారికి పంచిపెట్ట వచ్చును. శ్రీ సాయిబాబా నీతిబోధకమగు కథలు, లీలలు మిక్కిలి యాశ్చర్యము కలుగజేయును. అవి మనోవికలత పొందినవారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి యానందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదములవలె రంజకములు ఉపదేశకములునునగు బాబా ప్రబోధలు విని, వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావిణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తకరూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందమును కలుగజేయును. అందుచేత బాబాగారి యాత్మసాక్షాత్కారఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే యీ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా యహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా యిహపరసౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని.

నేను నా యంతట ఈ గ్రంథరచనకు బాబా యెక్క యనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అను వారు బాబాకు ముఖ్యభక్తుడు. వారిని నా తరపున మాట్లాడుమంటిని. నా తరవున వారు బాబాతో నిట్లనిరి. "ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. భిక్షాటనముచే జీవించు ఫకీరును నేను, నా జీవితచరిత్ర వ్రాయనవసరము లేదని యనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు. లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీయొక్క యనుమతి యాశీర్వాదము లేనిదే యేదియు జయప్రదముగా చేయలేము." సాయిబాబా దీనిని వినినంతనే మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి యాశీర్వదించెను. మరియు నిట్లు చెప్పదొడంగెను. "కథను, అనుభవములను, ప్రోగు చేయుమను. అక్కడక్కడ కొన్ని ముఖ్యవిషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసెదను. వాడు కారణమాత్రుడే కాని నా జీవితచరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన యహంకారమును విడువవలెను. దానిని నా పాదములపైన బెట్టవలెను. ఎవరయితే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికే నేను మిక్కిలి సహాయపడెదను. వారి జీవిత చర్యలకొరకే కాదు. సాధ్యమైనంతవరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను. వాని యహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడ లేకుండనప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచినదానినే నీవు నిర్థారణ చేయుటకు ప్రయత్నించకుము. ఇతరుల యభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము. ఏ విషయముపైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు."

వివాదమనగనే నన్ను హేమడ్ పంతు అని పిల్చుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. దానినే మీకు చెప్పబోవుచున్నాను. కాకా సాహెబు దీక్షిత్, నానా సాహెబు చాందోర్కరులతో నే నెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి. అట్లే చేసెదనని వారికి నేను వాగ్దానము చేసితిని. ఈ మధ్య నేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమున కడ్డుపడినది. లొనావ్లాలో నున్న నా స్నెహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు, మంత్రములన్నియు నుపయోగించెను గాని నిష్ఫలమయ్యెను. జ్వరము తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కాని ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని "నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువుయొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమి సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ యేల పోవలెను?" అని భావించి షిరిడీ ప్రయాణమును ఆపితిని. కాని కానున్నది కాక మానదు. అది ఈ క్రింది విధముగా జరిగెను.

నానాసాహెబు చాందోర్కర్ ప్రాంత ఉద్యోగి, వసాయీకి పోవు చుండెను. ఠాణానుండి దాదరుకు వచ్చి యచ్చట వసాయీ పోవు బండి కొరకు కనిపెట్టుకొని యుండెను. ఈ లోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేయుటవల్ల నాపై కోపించెను. నానా చెప్పినది, వినోదముగను సమ్మతముగాను ఉండెను. అందుచే నా రాత్రియే షిరిడీపోవ నిశ్చయించితిని. సామానులను కట్టుకొని షిరిడీ బయలుదేరితిని. దాదరు వెళ్ళి యచ్చట మన్నాడ్ మెయిలుకొరకు వేచి యుంటిని. బండి బయలుదేరునప్పుడు నేను కూర్చొనిన పెట్టెలోనికి సాయిబొకడు తొందరగా వచ్చి నా వస్తువులన్నియు జూచి యెక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా యా లోచన వారికి చెప్పితిని. వెంటనే బోరీ బందరు స్టేషనుకు బోవలయునని నాకు సలహా చెప్పెను. ఎందుకనగా మన్మాడు పోవుబండి దాదరులో నాగదనెను. ఈ చిన్న లీలయే జరగ కుండినచో నే ననుకొనిన ప్రాకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయెడివాడను. అనేక సందేహములుకూడ కలిగి యుండును. కాని యది యట్లు జరుగలేదు. నా యదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు 9, 10 గంటలలోగా షిరిడీ చేరితిని. నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ కనిపెట్టుకొని యుండెను.

ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సాఠేవాడ యొక్కటియే వచ్చుభక్తులకొరకు నిర్మింపబడి యుండెను. టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రము కలిగెను. అంతలో తాత్యా సాహెబు నూల్కరు అప్పుడే మసీదునుండి వచ్చుచు బాబా వాడాచివరన ఉన్నారని చెప్పెను. మొట్టమొదట ధూళీదర్శనము చేయమని సలహా యిచ్చెను. స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చుననెను. ఇది వినిన తోడనే బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసితిని. ఆనందము పొంగిపొరలినది. నానాసాహెబు చాందోర్కరు చెప్పినదానికి ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తిచెంది యాకలి దప్పికలు మరచితిని. మనస్సునకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్పమార్పుకలిగెను. నన్ను షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన నానాసాహెబును నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి ఋణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి దెచ్చుకొని, వారికి నా మనసులో సాష్టాంగప్రణామము చేసితిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనమువల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న యాలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మసుకృతముచే నాకీ దర్శనము లభించిన దనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచ మంతయు సాయిబాబా రూపము వహించెను.

గొప్ప వివాదము

నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలా సాహెబు భాటేకును గురువుయొక్క యావశ్యకతను గూర్చి గొప్ప వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి యింకొకరికి ఎందుకు లొంగియుండవలెనని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క యావశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మనుండి తప్పించుకొనవలెను. ఏమీచేయక సోమరిగా కూర్చొనువానికి గురువేమి చేయగలడు? నేను స్వేచ్ఛ పక్షమును ఆశ్రయించితిని. భాటే యింకొక మార్గము బట్టి ప్రారబ్దము తరపున వాదించుచు "కానున్నది కాకమానదు. మహనీయులుకూడ నీ విషయములో నోడిపోయిరి. మనుజు డొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివి తేటలను అటుండనిమ్ము. గర్వముగాని యహంకారము కాని నీకు తోడ్పడవు" ఈ వాదన యొక గంటవరకు జరిగెను. కాని యిదమిత్థమని చెప్పలేకుంటిమి. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. శరీరస్పృహ, అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని నిశ్చయించితిమి. వేయేల వివాదమునకు మూలకారణ మహంకారము.

ఇతరులతో కూడ మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి యిట్లడుగ దొడంగెను. "సాఠేవాడలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమడ్ పంతు ఏమని పలికెను?"

ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాఠేవాడ మసీదునకు చాల దూరముగ నున్నది. మా వివాదమునుగూర్చి బాబాకెట్లు దెలిసెను? అతడు సర్వజ్ఞూడై యుండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించును? బాబా మన యంతరాత్మపై నధికారియై యుండవచ్చును.

హేమడ్ పంతు అను బిరుదునకు మూలకారణము

నన్నెందుకు హేమడ్ పంతు అను బిరుదుతో పిలిచెను? ఇది హేమాద్రిపంతు అను నామమునకు మారు పేరు. దేవగిరి యాదవ వంశమున బుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రిపంతు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు; చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తియను గొప్పగ్రంధములను రచించినవాడు; మోడి భాషను కని పెట్టినవాడు. క్రొత్తపద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు. నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను. మేధాశక్తి యంతగా లేనివాడను. నా కెందుకీబిరుదు నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా నిది నా యహంకారమును చంపుటకొక యమ్మనియు, నే నెప్పుడును అణకువనమ్రతలు కలిగి యుండవలెనని బాబా కోరిక యయి యుండవచ్చుననియు గ్రహించితిని. వివాదములో గెలిచనందులకు బాబా యీ రీతిగా తెలివికి అభినందనము లిచ్చియుండునని యనుకొంటిని.

భవిష్యచ్చరితనుబట్టి చూడగా బాబా పలుకులకు (దభోల్కరును హేమడ్ పంతు అనుట) గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తును తెలిసియే యట్లనెననియు భావించవచ్చును. ఏలయనగా హేమడ్ పంతు శ్రీసాయిసంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను. లెక్కలను బాగుగ నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సత్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించెను.

గురువుయొక్క యావశ్యకత

ఈ విషయమై బాబా యేమనెనో హేమడ్ పంతు వ్రాసియుండలేదు. కాని కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమునుగూర్చి తాను వ్రాసికొనిన దానిని ప్రకటించెను. హేమడ్ పంతు బాబాను కలసిన రెండవ దినము కాకాసాహెబు దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా యని యడిగెను. బాబా యట్లే యని జవాబిచ్చెను. ఎవరో, యెక్కడకు అని యడుగగా, చాల పైకి అని బాబా చెప్పగా, మార్గమేది యని యడిగిరి. "అక్కడకు పోవుటకు అనేకమార్గములు కలవు. షిరిడీనుంచి కూడ నొక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున నున్న యడవిలో పులులు, తోడేళ్ళు కల" వని బాబా బదులిడెను. కాకా సాహెబు లేచి మార్గదర్శకుని వెంటదీసికొని పోయినచో నని యడుగగా, నట్లయినచో కష్టమే లేదని జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున నున్న తోడేళ్ళు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడ వచ్చును. లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. దభోళ్కరు అచ్చటనే యుండుటచే తన ప్రశ్న కిదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంతవిషయములలో మానవుడు స్వేచ్ఛాపరూడా కాడా? యను వివాదమువలన ప్రయోజనము లేదని గ్రహించెను. నిజముగా, పరమార్థము గురుబోధలవల్లనే చిక్కుననియు రామకృష్ణులు వసిష్ఠ సాందీపులకు లొంగి యణకువతో నుండి యాత్మసాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము, ఓపిక యను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
రెండవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

Chapter 3

శ్రీ సాయి సత్ చరిత్రము
మూడవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 3

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

మూడవ అధ్యాయము

సాయిబాబా యనుమతియు వాగ్ధానము, భక్తులకొరకు నిర్ణయించిన పని, - బాబా కథలు సముద్రమధ్యమున దీపస్తంభములు - వారి ప్రేమ, రోహిల్లా కథ - వారి మృదుమధురమైనట్టియు యమృతతుల్యమైనట్టియు పల్కులు.

సాయిబాబా యొక్క యనుమతియు వాగ్దానమును

వెనుకటి యధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సత్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి యనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి. "సత్చరిత్ర వ్రాయువిషయములో నా పూర్తి సమ్మతినిచ్చెదను. నీ పనిని నీవు నిర్వర్తించుము. భయపడకుము. మనస్సు నిలకడగా నుంచుము. నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నవిద్య నిష్క్రమించి పోవును. వానిని శ్రద్ధాభక్తులతో నెవరు వినెదరో వారకి ప్రపంచమందు మమత క్షీణించును. బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును. ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును."

ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండేవైపు తిరిగి బాబా యిట్లనెను.

"నా నామము ప్రేమతో నుచ్చరించిన వారి కోరిక లన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారి నన్ని దిశలందు కాపాడెదను. ఏ భక్తులయితే మనఃపూర్వకముగా నాపై నాధారపడియున్నారో వారీ కథలు వినునప్పుడు మిక్కిలి సంతసించెదరు. నా లీలలు పాడువారి కంతులేని యానందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరయితే శరణాగతి వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా యాకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధనములనుండి తప్పించుట నా ముఖ్యలక్షణము. ప్రపంచములోని వానినన్నిటిని మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా కథలను జీవితమున మననము చేయుచు, ఎల్లప్పుడు నన్ను జ్ఞప్తియందుంచుకొనువారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు? వారిని మరణమునుండి బయటకు లాగెదను. నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును. కాబట్టి భక్తిశ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించిపోవును. వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకముగలవారికి శుద్ధచైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి యను నామమును జ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రమున, చెడు పలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును."

భక్తులకు వేర్వేరు పనులు నియమించుట

భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నదివొడ్డున మెట్లు, మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. నన్నీ సత్చరిత్ర వ్రాయుమని నియమించిరి. అన్ని విషయములు పూర్తిగా తెలియనివాడనగుటచే, ఈ పనికి నాకు అర్హత లేదు. అయితే యింత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయియెక్క కరుణయే యంత కఠినమైన పని యొనర్చు శక్తిని ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగనే సాయిబాబా నా యహంకారమును పెరికివేసి వారి కథలను వారే వ్రాసికొనిరి. కనుక ఈ కథలను వ్రాసిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు గాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికిని శ్రుతి స్మృతి యను రెండు కండ్లు లేకుండుటచే సాయి సత్చరిత్రను వ్రాయలేకుంటిని. కాని భగవంతుని అనుగ్రహము మూగవానిని మాట్లాడునట్లు చేయును; కుంటివానిని పర్వతములు దాటునట్లు చేయును. తన యిచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొనుటలో ఆ భగవంతునికే యా చాతుర్యము కలదు. హార్మోనియమునకుగాని వేణువునకుగాని ధ్వనులు ఎట్లువచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియును. చంద్రకాంతము ద్రవించుట, సముద్రముప్పొంగుట వానివల్ల జరుగదు. కాని చంద్రోదయమువల్ల జరుగును.

బాబా కథలు దీపస్తంభములు

సముద్రమథ్యమందు దీపస్తంభములుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురువల్ల రాళ్ళురప్పలవల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా పోవుదురు. ప్రపంచమను మహాసముద్రములో బాబా కథలను దీపములు దారిచూపును. అవి అమృతముకంటె తియ్యగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను, సుగమముగను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవులద్వారా హృదయమందు ప్రవేశించునపుడు శరీర స్పృహయును, అహంకారమును, ద్వంద్వభావములును నిష్క్రమించును. అవి మన హృదయమందు నిల్వచేసినచో సందేహములు పటాపంచలయిపోవును. శరీరగర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వచేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడినగాని వినినగాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి యివియే మోక్షమునకు సులభసాధనము. కృతయుగములో శమదమములు (అనగా నిశ్చలమనస్సు, శరీరము) త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట, మోక్షమార్గములు. నాలుగు వర్ణములవారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని, మహిమలను పాడుట యతిసులభము. మనమనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్కథలను వినుటవలన పాడుటవలన మనకు శరీరమందు గల యభిమానము పోవును. అది భక్తులను నిర్మోహులుగ జేసి, తుదకు ఆత్మసాక్షాత్కారము పొందునట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సత్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగ చదువగలరు; వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసికొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తికలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది యాత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సత్చరితామృతమును వ్రాయుట తయారుచేయుట బాబాయొక్క కటాక్షముచేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడగనే యుంటిని.

సాయిబాబా యొక్క మాతృప్రేమ

ఆవు తన దూడ నెట్లు ప్రేమించునో యందరికి తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడు నిండియే యుండును. దూడకు కావలసినప్పుడెల్ల కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును, అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసికొని సరిగాచేయును. బిడ్డకు ఈ విషయమేమియు తెలియదుగాని తల్లి తన బిడ్డలు దుస్తులు ధరించి యలంకరింపబడుట చూచి యమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చ దగిన దేదియు లేదు. అది యసామాన్యము; నిర్వ్యాజము. సద్గురువులు కూడ నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు గూడ నాయందట్టి ప్రేమ యుండెను. దానికీ క్రింది యుదాహరణ మొకటి.

1916వ సంవత్సరములో నేను సర్కారు ఉద్యోగమునుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురుపౌర్ణమినాడు ఇతర భక్తులతో నేను కూడ షిరిడీ పోయితిని. అణ్ణాచించణీకర్ నాగురించి బాబాతో నిట్లనెను. "దయచేసి వానియందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వాని కింకేదైన ఉద్యోగ మిప్పించుము. వాని యాతురుతను తీసివేయుము. వానికానందము కలుగునట్లు చేయుము". అందులకు బాబా యిట్లు జవాబిచ్చెను. "వాని కింకొక ఉద్యోగము దొరుకును, కాని వాడిప్పుడు నా సేవలో తృప్తిపడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగనే యుండును. ఎన్నటికిని నిండుకొనవు. వాని దృష్టి నంతటిని నావైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరియెడ అణకువ, నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగ పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును."

నన్ను పూజింపుడను దానిలోని ఈ 'నన్ను' ఎవరు? అను ప్రశ్నకు సమాధానము 'సాయిబాబా యెవరు' అను దానిలో విశదీకరింపబడి యున్నది. మొదటి అధ్యాయమునకు పూర్వము ఉపోద్ఘాతములో చూడుడు.

రోహిల్లా కథ

రోహిల్లాకథ విన్నచో బాబా ప్రేమ యెట్టిదో బోధపడును. పొడుగాటివాడును, పొడుగైన చొక్కా తొడిగినవాడును, బలవంతుడునగు రోహిల్లా యొకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిరనివాసము ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు "అల్లాహు అక్బర్" యని యాంబోతు రంకెవేయునట్లు బిగ్గరగా నరచుచుండెను. పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి యింటికి వచ్చిన షిరిడీ ప్రజలకు నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ళవరకు వారు దీని నోర్చుకొనిరి. తుదకు బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరపుల నాపుమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయేకాక వారిపై కోపించి వారిపనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించెను. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్యగలదనియు, ఆమె గయ్యాళి యనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధపెట్టుననియు బాబా చెప్పెను. నిజముగా రోహిల్లాకు భార్యయేలేదు. భార్యయనగా దుర్భుద్ధియని బాబా యభిప్రాయము. బాబాకు అన్నింటికంటె దైవప్రార్థనలందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి, ఊరిలోనివారి నోపికతో నోర్చుకొని బాధను సహింపవలసినదనియు నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధిచెప్పెను.

బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు

ఒకనాడు మధ్యాహ్నహారతి యయిన పిమ్మట భక్తులందరు తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు బాబా యీ క్రింది చక్కని యుపదేశమిచ్చిరి.

“మీ రెక్కడ నున్నప్పటికి నేమి చేసినప్పటికి నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయముల పాలించు వాడను; అందరి హృదయములలో నివసించువాడను. ప్రపంచమందుగల చరాచర జీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టిస్థితిలయకారకుడను నేనే. ఎవరయితే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారిని మాయ శిక్షించదు. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే, నా రూపమే.”

ఈ చక్కని యమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో నెవరి సేవ చేయక గురుసేవయే చేయుటకు నిశ్చయించితిని. కాని అణ్ణాచించణీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా యని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరకెను. కాని అది కొద్దికాలము వరకే. అటుపిమ్మట వేరే పనియేదియు చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని.

ఈ యధ్యాయము ముగించకముందు, చదువరులకు నేను చెప్పునదేమన, బద్ధకము, నిద్ర, చంచలమనస్సు, శరీరమందభిమానము మొదలగు వానిని విడిచి, వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురు గాక. ఇతర మార్గములవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందరు నొకే మార్గమును త్రొక్కుదురు గాక. అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి యజ్ఞానమును నశింపజేయును; మోక్షమును సంపాదించి పెట్టును. లోభియెక్కడ నున్నప్పటికిని వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు, బాబాను కూడ నెల్లవారు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
మూడవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

Chapter 4

శ్రీ సాయి సత్ చరిత్రము
నాలుగవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 4

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నాలుగవ అధ్యాయము

యోగీశ్వరుల కర్తవ్యము - షిరిడీ పుణ్యక్షేత్రము - సాయిబాబా యొక్క రూపురేఖలు - గౌలిబువా గారి వాక్కు - విఠల్ దర్శనము క్షీరసాగరుని కథ - దాసగణు ప్రయాగ స్నానము - సాయిబాబా అయోని సంభవము - షిరిడీకి వారి మొదటిరాక - మూడు బసలు.

యోగీశ్వరుల కర్తవ్యము

భగవద్గీత చతుర్థాధ్యాయమున 7, 8, శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. "ధర్మము నశించునపుడు అధర్మము వృద్ధిపొందునపుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు, యుగయుగములందు అవతరించెదను". ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్ల అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులవారి హక్కులను అపహరించునప్పుడు, మతగురువులను గౌరవించక యవమానించునపుడు, ఎవరును మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని యనుకొనునపుడు, జనులు నిషిద్ధాహారములు త్రాగుడులకలవాటుపడినపుడు, మతము పేరుతో కానిపనులు చేయునపుడు, వేర్వేరు మతములవారు తమలోతాము కలహించునపుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునపుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనపుడు, ప్రజల ధనదారాసంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్షమార్గమును మరచునపుడు, యొగీశ్వరులుద్భవించి వారి వాక్కాయకర్మలచే ప్రజలను సవ్యమార్గమున బెట్టి వ్యవహారముల చక్కదిద్దుదురు. వారు దీపస్తంభములవలె సహాయపడి, మనము నడువవలసిన సన్మార్గములను సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయీ, ఏకనాథుడు, తుకారము, నరహరి, నర్సిబాయి, సజన్ కా సాయి, సాంవతమాలి, రామదాసు మొదలుగాగల యోగులను, తదితరులును వేర్వేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన మార్గమును జూపిరి. అట్లే సాయిబాబాగూడ సకాలమందు షిరిడీ చేరిరి.

షిరిడీ పుణ్యక్షేత్రము

అహమదునగరు జీల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాల పుణ్యతమములు. ఏలయన నచ్చట ననేకులు యోగులుద్భవించిరి, నివాసము చేసిరి. అట్టివారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు. షిరిడీ అహమదునగరు జిల్లాలోని కోపర్ గాం తాలూకాకు చెందినది. కోపర్ గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నదిదాటి 3 కోసులు పోయినచో నీమగాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందుగల గాణగాపురం, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగాగల పుణ్యక్షేత్రముల వలె షిరిడీకూడ గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున నున్న మంగళవేధ యందు భక్తుడగు దామాజీ, సజ్జనగడ యందు సమర్థ రామదాసు, నర్సోబాచీవాడీయందు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్ర మొనర్చెను.

సాయిబాబా రూపురేఖలు

సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా యెట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమునుదాటి జయించిరి. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవభక్తుల కిల్లువంటివారు; నశించు వస్తువులయందభిమానము లేనివారు; భూలోక మందుగాని, స్వర్గలోకమందుగాని గల వస్తువులయందభిమానము లేనివారు. వారి యంతరంగము అద్దమువలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి యమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు, వారికి సమానమే. మానావమానములను లెక్కించినవారుకారు; అందరికి వారు ప్రభువు. అందరితో కలసిమెలసి యుండెడివారు. ఆటలు గాంచెడివారు; పాటలును వినుచుండెడివారు; ప్రపంచమంతా మేలుకొనునప్పుడు వారు యోగనిద్రయందుండెడి వారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి యంతరంగము లోతయిన సముద్రమువలె ప్రశాంతము, వారి యాశ్రమము, వారి చర్యలు ఇదమిత్థముగా నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచోటనే కూర్చుండునప్పటికిని ప్రపంచమందు జరుగు సంగతులన్నియు వారికి తెలియును, వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందలకొలది కథలు చెప్పునప్పటికి మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడు మసీదుగోడకు ఆనుకొని నిలుచువారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండీ తోట వైపుగాని చావడి వైపుగాని పచారు చేయుచుండెడివారు. ఎల్లప్పుడు ఆత్మధ్యానమునందే మునిగి యుండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికిని సాధకునివలె నటించువారు. అణకువ, నమ్రత కలిగి, యహంకారము లేక యందరిని సంతసింప జేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీనేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. ఆళందిని జ్ఞానేశ్వరమహారాజు వృద్ధి చేసినట్లు, ఏకనాథు పైఠనును వృద్ధిచేసినట్లు సాయిబాబా షిరిడీని వృద్ధిచేసెను. శిరీడీలోని గడ్డి, రాళ్ళు పుణ్యము చేసికొన్నవి. ఏలయిన బాబా పవిత్రపాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైని వేసికొనగలిగినవి. మావంటి భక్తులకు షిరిడీ, పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశి, రామేశ్వరము, బదరి కేదార్, నాసిక్, త్ర్యంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణములవంటిదయినది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణము తంత్రమును. అది మాకు సంసారబంధముల సన్నగిలచేసి యాత్మసాక్షాత్కారమును సులభసాధ్యము చేసెను. శ్రీ సాయి దర్శనమే మాకు యోగసాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణీప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది. వారి యాజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మాపాలిటి శ్రీ కృష్ణుడుగ, శ్రీ రాముడుగ నుండి ఉపశమనము కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. వారు ద్వంద్వాతీతులు; నిరుత్సాహముగాని ఉల్లాసముగాని యెరుగరు. వారు ఎల్లప్పుడు సత్చిదానందస్వరూపులుగా నుండెడివారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా, భక్తులన్ని దేశములనుండి షిరిడీ చేరి, వారిని దర్శించి వారి యాశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడిది. పండరీపురమందు విఠల్ రఖుమాయిని దర్శించినచో భక్తలకు కలిగెడి యానందము షిరిడీలో దొరకుచుండెడిది. ఇది యతిశయోక్తి కాదు. ఈ విషయముగూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు.

గౌలిబువా అభిప్రాయము

95 సంవత్సరములు వయస్సుగల గౌలిబువ యను వృద్ధ భక్తుడొకడు పండరీయాత్ర ప్రతిసంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందును, మిగత నాలుగు మాసములు ఆషాఢము మొదలు కార్తికమువరకు గంగానది యొడ్డునను ఉండెడివాడు. సామాను మోయుట కొక గాడిదను, తోడుగా నొకశిష్యుని తీసికొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీయాత్ర చెసికొని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చెడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబావైపు చూచి యిట్లనెను. "వీరు పండరీనాథుని యవతారమే! అనాథలకొరకు, బీదలకొరకు, వెలసిన కారుణ్యమూర్తి." గౌలిబువా వీఠోబాదేవుని ముసలి భక్తుడు. పండిరియాత్ర యెన్నిసారులో చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని యవతారమని నిర్ధారణ పరచిరి.

విఠలదేవుడు దర్శనమిచ్చుట

సాయిబాబకు భగవన్నామస్మరణయందును, సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అని యనెడివారు. అనగా అల్లాయే యజమాని. ఏడు రాత్రింబగళ్ళు భగవన్నామస్నరణ చేయించు చుండెడివారు. దీనినే నామసప్తాహ మందురు. ఒకప్పుడు దాసుగణు మహారాజును నామసప్తాహము చేయుమనిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్ధాన మిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసుగణు జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయివేసి "తప్పనిసరిగ దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తిప్రేమలతో నుండవలెను. డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీ కృష్ణుని ద్వారకాపట్టణము, ఇక్కడనే యనగా షిరిడీలోనే యున్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తిప్రేమలతో కీర్తించునపుడు విఠలుడిక్కడనే యవతరించును" అనెను.

సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడీ క్రిందివిధముగా దర్శనమిచ్చెను. స్నానాంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాకా మధ్యాహ్న హారతికొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా బాబా యిట్లడిగెను. "విఠలు పాటీలు వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుము. ఏమాత్రము అజాగ్రత్తగ నున్నను తప్పించుకొని పారిపోవును." ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25, 30 విఠోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని జూచి బాబామాటలు జ్ఞాపకమునకు దెచ్చుకొని, కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను.

భగవంతరావు క్షీరసాగరుని కథ

విఠలపూజయందు బాబాకెంత ప్రీతియో, భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు యాత్రచేయుచుండెడివాడు. ఇంటివద్ద కూడ విఠోబా ప్రతిమనుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు, బాబా వాని తండ్రిని జ్ఞప్తికి దెచ్చుకొని; "వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడు పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడ ఆకలితో మాడ్చినాడు. అందుచేత వీని నిక్కడకు తెచ్చితిని. వీడు చెయునది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసెదను" అనిరి.

ప్రయాగ క్షేత్రములో దాసగణు స్నానము

గంగానది యమునానది కలియుచోటునకు ప్రయాగయని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగణు అచ్చటికిపోయి స్నానము చేయవలెనని మనస్సున దలచెను. బాబావద్దకేగి యనుమతించు మనెను. అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. "అంతదూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ యిచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము." ఇట్లనునంతలో నాశ్చర్యములన్నిటికంటె నాశ్చర్యకరమైన వింత జరిగినది. దాసుగణు మహారాజు బాబా పాదములపై శిరస్సునుంచిన వెంటనే బాబా రెండుపాదముల బొటన వ్రేళ్ళనుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును దాసుగణు చూచి ఆశ్చర్యనిమగ్నుడై, భక్తి ప్రైమలతో మైమరచి కంట తడి పెట్టుకొనెను. ఆంతరిక ప్రేరణతో బాబాను వారి లీలలను పాట రూపముగా వర్ణించి పొగడెను.

బాబా అయోనిసంభవుడు; షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట

సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని జన్మస్థానమును గూర్చిగాని యెవరికి ఏమియు తెలియదు. పెక్కుసారులు కనుగొనుటకు ప్రయత్నించిరి. పెక్కుసారులీ విషయము బాబాను ప్రశ్నించిరి గాని యెట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు, సామాన్యమానవులవలె జన్మించియుండలేదు. ముత్యపు చిప్పలలో చిన్నపాపలవలె చిక్కిరి. నామదేవు భీమరథి నదిలో గొణాయికి కనిపించెను. కబీరు భాగీరథీనదిలో తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తులకొరకు 16 ఏండ్ల బాలుడుగా షిరిడీలోని వేపచెట్టు క్రింద నవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. స్వప్నావస్థయందయినను ప్రపంచవస్తువులను కాక్షించెడివారుకాదు. మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించు చుండెను. నానాచోవ్ దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా నిట్లు వర్ణించినది. "ఈ చక్కని చురుకైన, అందమైనకుర్రవాడు వేపచెట్టుక్రింద ఆసనములోనుండెను. వేడిని, చలిని లెక్కింపక యంతటి చిన్నకుర్రవాడు కఠినతప మాచరించుట సమాధిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడిరి. పగలు ఎవరితో కలిసెడివాడు కాదు. రాత్రియందెవరికి భయపడువాడు కాడు. చూచినవారశ్చర్యనిమగ్నులై యీ చిన్న కుఱ్ఱవా డెక్కడనుండి వచ్చినాడని యడుగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాల అందముగ నుండెను. ఒక్కసారి చూచినవారెల్లరు ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరింటికి పోకుండెను, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనువాడు. పైకి చిన్న బాలునివలె గాన్పించినప్పటికిని చేతలనుబట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన యాతనిగూర్చి యెవరికి నేమి తెలియకుండెను." ఒకనాడు ఖండోబా దేవు డొకని నావేశించగా నీబాలు డెవడయి యుండునని ప్రశ్నించిరి. వాని తల్లి దండ్రు లెవరని యడిగిరి. ఎచ్చటి నుండి వచ్చినాడని యడిగిరి. ఖండోబా దేవుడొక స్థలమునుచూపి గడ్ఢపారను దీసికొని వచ్చి యచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా నిటుకలు, వాని దిగువ వెడల్పు రాయి యొకటి గాన్పించెను. అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను. ఆ సందు ద్వారా పోగా నొక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ నిర్మాణములు, కఱ్ఱబల్లలు, జపమాలలు గాన్పించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు నభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుఱ్ఱవాని నీ విషయము ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి యచ్చట గలదు గావున దానిని గాపాడవలెననియు చెప్పెను. వెంటనె దాని నెప్పటివలె మూసివేసిరి. అశ్వత్థ, ఉదుంబర, వృక్షములవలె నీ వేపచెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. షిరిడీలోని భక్తులు, మహాళ్సాపతియు దీనిని బాబాయొక్క గురువుగారి సమాధిస్థానమని భావించి సాష్టాంగనమస్కారములు చేసెదరు.

మూడు బసలు

వేపచెట్టును, దానిచుట్టునున్న స్థలమును హరివినాయకసాఠే అను వాడు కొని సాఠెవాడ యను పెద్ద వసతిని గట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తమండలి కిది యొక్కటియే నివాసస్థలము, వేపచెట్టు చుట్టు అరుగు ఎత్తుగా కట్టిరి. మెట్లు కట్టిరి. మెట్ల దిగువన నొక గూడు వంటిది గలదు. భక్తులు మండపముపై నుత్తరముఖముగా కూర్చొనెదరు. ఎవరిచ్ఛట గురువారము; శుక్రవారము ధూపము వేయుదురో వారు బాబా కృపవల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడ చాల పురాతనమైనది. కావున మరామత్తునకు సిద్థముగా నుండెను. తగిన మార్పులు, మరామత్తులు సంస్థానమువారు చేసిరి.

కొన్ని సంవత్సరముల పిమ్మట ఇంకొకటి దీక్షిత్ వాడాయను పేరుతో కట్టిరి. న్యాయవాది కాకాసాహెబు దీక్షిత్ ఇంగ్లండుకు బోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలుకుంటుపడెను. అది యెంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానా సాహెబు చాందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా యిచ్చెను. 1909వ సంవత్సరమున కాకా బాబావద్దకు బోయి కాలు కుంటితనము కన్న తన మనస్సులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్థించెను. బాబా దర్శనమాత్రమున అమితానందభరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. తనకొరకును, ఇతరభక్తులకును పనికి వచ్చునట్లు ఒక వాడను నిర్మించెను. 10-12-1910వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగెను. (1) దాదాసాహెబు ఖాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను. (2) చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడా పూర్తి కాగానే 1911వ సంవత్సరములో శ్రీరామ నవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి.

తరువాత కోటీశ్వరుడును నాగపూరు నివాసియగు బుట్టీ మరియొక పెద్దరాతిమేడను నిర్మించెను. చాల ద్రవ్యము దీనికొరకు వెచ్చించెను. ద్రవ్యమంతయు దానికై సవ్యముగా వినియోగపడెను. ఏలయన బాబాగారి భౌతికశరీరమందులో సమాధిచేయబడినది. దీనినే సమాధిమందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోటయుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసెడివారు.

ఇట్లు మూడు వాడాలు (వసతి గృహములు) కట్టబడెను. అంతకుముందిచ్చట నొక్క వసతిగృహము కూడ లేకుండెను. అన్నిటికంటె సాఠేవాడ చాలా ఉపకరించుచుండెను.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నాలుగవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

Chapter 5

శ్రీ సాయి సత్ చరిత్రము
అయిదవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 5

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

అయిదవ అధ్యాయము

చాంద్ పాటీలు పెండ్లివారితో కలసి బాబా తిరిగి షిరిడీ రాక; సాయీ యని స్వాగతము; ఇతర యోగులతో సహవాసము; పాదుకల చరిత్ర; మొహియుద్దీన్ తో కుస్తి; జీవితములో మార్పు; నీళ్ళను నూనెగా మార్చుట; జౌహర్ అలీ యను కపటగురువు.

పెండ్లి వారితో కలసి తిరిగి షిరిడీ వచ్చుట

ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయు డొకండుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుఱ్ఱము తప్పిపోయెను. రెండుమాసములు శోధించినను దాని యంతు దొరకకుండెను. అతడు నిరాశచెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాదునుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. 9 మైళ్ళు నడచిన పిమ్మట నొక మామిడిచెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చొనియుండెను. అతడు తలపై టోపి, పొడుగైన చొక్కా ధరించియుండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలును జూచి, అతనిని బిలిచి చిలుము త్రాగి కొంతతడవు విశ్రాంతిగొనుమనెను. జీనుగురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుఱ్ఱముదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను. దగ్గరగా నున్న కాలువలో వెదకుమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుఱ్ఱమును చూచి మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణమనుజుడు కాడనియు గొప్ప ఔలియా (యోగిపుంగవుడు) అయివుండవచ్చుననియు అనుకొనెను. గుఱ్ఱమును దీసికొని ఫకీరువద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కాని నీరు, నిప్పు కావలసి యుండెను. చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసియుండెను. ఫకీరు ఇనుపచువ్వను భూమిలోనికి గ్రుచ్చగా నిప్పు వచ్చెను. సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. చప్పి నా నీటితో తడిపి, నిప్పుతో చిలుమును వెలిగించెను. అంతయు సిద్ధముగా నుండుటచే ఫకీరు ముందుగా చిలుము పీల్చి చాంద్ పాటీలు కందించెను. ఇదంతయు జూచి చాంద్ పాటీలు ఆశ్చర్యమగ్నుడయ్యెను. ఫకీరును తన గృహము నకు రమ్మనియు, అతిథిగా నుండుమనియు చాంద్ పాటీలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి యచ్చట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురుది షిరిడీ గ్రామము. అందుచే షిరిడీ పోవుటకు పాటీలు కావలసినవన్ని జాగ్రత్త చెసికొని ప్రయాణమునకు సిద్ధపడెను. పెండ్లి వారితో కూడ ఫకీరు బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లి వారు ధూప్ గ్రామము తిరిగి వచ్చిరి గాని ఫకీరు షిరిడీలో ఆగి యచ్చటనే స్ధిరముగా నిలిచెను.

ఫకీరుకు సాయినామ మెట్లు వచ్చెను?

పెండ్లివారు షిరిడీ చేరగనే ఖండోబామందిరమునకు సమీపమున నున్న భక్తమహాళ్సాపతిగారి పొలములో నున్న మఱ్ఱిచెట్టు క్రింద బసచేసిరి. ఖండోబామందిరమునకు తగిలియున్న ఖాళీజాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో నున్నవారొకరితరువాత నొకరు దిగిరి. ఫకీరు కూడ అట్లనే దిగెను. భక్తమహాళ్సాపతి యా చిన్నఫకీరు దిగుట జూచి "దయచేయుము సాయీ" యని స్వాగతించెను. తక్కినవారు గూడ ఆయనను సాయి యని పిలువనారంభించిరి. అదిమొదలు వారు సాయిబాబా యని ప్రఖ్యాతులైరి.

ఇతరయోగులతో సహవాసము

సాయిబాబా షిరిడీలో నొక మసీదులో నివాస మేర్పరచు కొనిరి. బాబా రాకపూర్వమే దేవిదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరములనుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమున కిష్టపడెను. అతనితో కలసి మారుతీ దేవాలయములోను, చావడిలోను, కొంతకాల మొంటరిగాను ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అను నింకొక యోగి యచ్చటకు వచ్చెను. బాబా ఎల్లప్పుడు ఈ యోగితో మాట్లాడుచు కాలము గడుపుచుండువారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీ దాసు పోవుచుండెను. అట్లనే యొక వైశ్యయోగి పుణతాంబే నుంచి వచ్చుచుండెడివాడు. వారి పేరు గంగాఘీరు. అతనికి సంసార ముండెను. అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్లుమోసి పూలచెట్లకు పోయుట జూచి యిట్లనెను. "ఈ మణి యిచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్ళు మోయుచున్నాడు. కాని యితడు సామాన్యమానవుడు కాడు. ఈ నేల పుణ్యము చేసికొనినది గనుక సాయిబాబా యను నీ మణిని రాబట్టుకొనగలిగెను." యేవేలా గ్రామములో నున్న మఠములో ఆనందనాథుడను యోగిపుంగవుడుండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామనివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను జూచి యిట్లనెను. "ఇది యమూల్యమైన రత్నము. ఈతడు సామాన్యమానవునివలె గాన్పించునప్పటికిని యిది మామూలు రాయికాదు. యిదియొక రత్నమణి. ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు." ఇట్లనుచు యేవలా చేరెను. ఇది శ్రీ సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి.

బాబా దుస్తులు - వారి నిత్యకృత్యములు

యౌవనమునందు బాబా తలవెంట్రుకలు కత్తిరించక జుట్టు పెంచుచుండెను. పహిల్వానువలె దుస్తులు వేసికొనిడివారు. షిరిడీకి మూడుమైళ్ళదూరములో నున్న రహాతా పోయినపుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసికొనివచ్చి, నేలను చదునుచేసి, వానిని నాటి, నీళ్ళు పోయుచుండెను. బావినుండి నీళ్ళుచేది కుండలు భుజముపై పెట్టుకొని మోయుచుండెను. సాయంకాలము కుండలు వేపచెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చనివగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగుచుండెడివి. ఆ మరుసటి దినము తాత్యా యింకొక రెండు కుండలను ఇచ్చుచుండెడివాడు. ఇట్లు మూడుసంవత్సరములు గడచెను. సాయిబాబా కృషివలన అచ్చట నొక పూలతోట లేచెను. ఆ స్థలములోనే యిప్పుడు బాబా సమాధి యున్నది. దానినే సమాధిమందిర మందురు. దానిని దర్శించుట కొరకే యనేకమంది భక్తులు విశేషముగా పోవుచున్నారు.

వేపచెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము

అక్కల్ కోటకర్ మహారాజుగారి భక్తుడు భాయి కృష్ణజీ అలి బాగ్ కర్. ఇతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి ఫోటోను పూజించెడి వాడు. అతడొకప్పుడు షోలాపూరు జిల్లాలోని అక్కల్ కోట గ్రామమునకు పోయి మహారాజుగారి పాదుకలు దర్శించి పూజించవలెనని యనుకొనెను. అతడచ్చటికి పోకమునుపే స్వప్నములో మహారాజు దర్శనమిచ్చి యిట్లు చెప్పెను. "ప్రస్తుతము షిరిడీ నా నివాసస్థలము. అచ్చటికి పోయి నీ పూజ యొనరింపుము." అందుచే భాయి కృష్ణజీ తన నిర్ణయమును మార్చుకొని షిరిడీ చేరి బాబాను పూజించి యచ్చటనే యారు మాసములు ఆనందముతోనుండెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణమాసములో నొక శుభదినమున వేపచెట్టుక్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది 1912వ సంవత్సరములో జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీబాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. ఒక దీక్షిత బ్రాహ్మణుడు నిత్యపూజ చేయుటకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు అధికారము భక్తసగుణున కబ్బెను.

ఈ కథయొక్క పూర్తి వివరములు

ఠాణేవాసి బి.వి.దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు విరమించిన మామలతదారు. వేపచెట్టుక్రింద పాదుకల విషయము సంగతులన్నియు భక్తసగుణనుండి గోవిందకమలాకర్ దీక్షిత్ నుండి సంపాదించి, పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీసాయిలీల 11వ సంపుటిలో నీరీతిగా ప్రచురించిరి.

1912వ సంవత్సరము బొంబాయినుండి రామారావు కొఠారె యను డాక్టరొకడు షిరిడీ వచ్చెను. వాని మిత్రుడొకడు, వాని కాంపౌండర్ భాయికృష్ణజీ అలిబాగ్ కర్ అనునతడు వెంట వచ్చిరి. వారు భక్తసగుణుతోను జి. కె. దీక్షిత్ తోను స్నేహము చేసిరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకొనునపుడు బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేపచెట్టు క్రింద తపస్సు చేసినదాని జ్ఞాపకార్థము బాబా యొక్క పాదుకలను వేపచెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకొనిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి. అప్పుడు భాయి కృష్ణజీ స్నేహితుడగు కాంపౌండర్ లేచి యా సంగతి డాక్టరు రామారావుకొఠారెకు దెలిపినచో చక్కని పాదుకలు చెక్కించెదరని నుడివెను. అందరు ఈ సలహాకు సమ్మతించిరి. డాక్టరుగారికి ఈ విషయము తెలియపరచిరి. వారు వెంటనే షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి.

ఖండోబా మందిరమందున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకలను జూపిరి. వారు కొన్ని మార్పులను జేసి, పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేపచెట్టు గొప్పతనమును దెలుపు యీ క్రింది శ్లోకమును కూడ చెక్కుమనిరి.

సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతమ్|
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం||

ఉపాసనీ సలహాల నామోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండరు ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమినాడు స్థాపన చేయుమని బాబా యాజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జి. కె. దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరమునుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా యా పాదుకలను తాకెను. అవి భగవంతుని పాదుకలని నుడివెను. చెట్టుక్రింద ప్రతిష్ఠింపుడని యాజ్ఞాపించెను. శ్రావణ పౌర్ణమి ముందురోజు బొంబాయి పాస్తాసేట్ యను పార్సీ భక్తుడొకడు మనియార్డరు ద్వారా రూ. 25లు పంపెను. బాబా యీ పైకము పాదుకలను స్థాపించు ఖర్చునిమిత్త మిచ్చెను. మొత్తము రూ. 100లు ఖర్చు పెట్టిరి. అందులో రూ. 75లు చందాలవల్ల వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జి.కె.దీక్షిత్ యను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజచేసెను. తరువాత లక్షణ్ కచేశ్వర్ జఖాడె యను బ్రాహ్మణుడు (నానుమామా పూజారి) పూజ చేయుచుండెను. మొదటి 5 సం||ములు నెలకు రూ. 2లు చొప్పున డాక్టర్ కొఠారె దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకలచుట్టు కంచెకూడ పంపెను. ఈ కంచెయు, పై కప్పును కోపర్ గాం స్టేషనునుండి షిరిడీ తెచ్చుటకు 7-8-0 ఖర్చు భక్తసగుణు ఇచ్చెను. ప్రస్తుతము జఖాడె పూజచేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును, దీపమును పెట్టుచున్నాడు.

మొట్టమొదట భాయికృష్ణజీ అక్కల్ కోటకర్ మహారాజు భక్తుడు. 1912వ సం||ములో వేపచెట్టు క్రింద పాదుకలు స్థాపించునపుడు అక్కల్ కోటకు పోవుచు మార్గమధ్యమున షిరిడీయందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్ కోట గ్రామమునకు పోవలెననుకొని బాబావద్దకేగి యనుమతి నిమ్మనెను. బాబా యిట్లనెను. "అక్కల్ కోటలో నేమున్నది? అక్కడకేల పోయెదవు? అక్కడుండే మహారాజు ప్రస్తుతమిక్కడ నున్నారు. వారు నేనే." ఇది విని భాయి కృష్ణజీ అక్కల్ కోటవెళ్లుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేసెను.

హేమడ్ పంతున కీసంగతులు తెలియవు. వారికి తెలిసియున్నచో సత్చరిత్రలో వ్రాయుట మానియుండరు.

మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ - జీవితములో మార్పు

షిరిడీగ్రామములో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి యనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయము వచ్చి కుస్తీపట్టిరి. అందులో బాబా యోడిపోయెను. అప్పటినుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని పొడవు చొక్కాను తొడిగికొని నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకిగుడ్డలతో సంతుష్టి చెందెడివారు. రాజ్య భోగముకంటె దారిద్ర్యమే మేలని నుడివెడివారు. దరిద్రుని స్నేహితుడు భగవంతుడే. గంగాఘీరుకు కూడ కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగెను. అదే కాలమందు శరీరమును మాడ్చి దేవుని సహవాసము చేయవలెనని యాకాశవాణి పలికెను. అప్పటినుండి గంగాఘీరు సంసారమును విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నదియొడ్డున యొక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను.

సాయిబాబా జనులతో కలసి మెలసి తిరుగువారు కారు. అడిగినపుడు మాత్రము జవాబిచ్చువారు. దినమంతయు వేపచెట్టునీడయందు, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ యొడ్డునందుండు తుమ్మ చెట్టు నీడన కూర్చొనెడివారు. సాయంకాల మూరకనే పచారు చేయువారు. లేదా నీమగాం పోవుచుండెడివారు. త్రయంబక్ జీ డేంగ్లే యనునతని యింటికి తరచుగా పోవువారు. డేంగ్లేయందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు ద్వీతీయవివాహము చేసికొన్నను సంతానము కలుగలేదు. బాబాసాహెబు డేంగ్లే నానాసాహెబును సాయిబాబా వద్దకు పంపెను. వారి యనుగ్రహముచే పుత్ర సంతానము కలిగెను. అప్పటినుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండిరి. వారికీర్తి యంతట వెల్లడియాయెను. అహమద్ నగరు వరకు వ్యాపించెను. అక్కడనుంచి నానాసాహెబు చాందోర్కరు, కేశవ చిదంబర్ మొదలుగాగల యనేకమంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడివారు. బాబా రాత్రులందు పాడుపడిన పాతమసీదునందు శయనించుచుండెను. అప్పట్లో బాబాయొక్క సామానులు చాల తక్కువ. అవి చిలుము, పొగాకు, తంబిరేలు గ్లాసు, పొడుగుచొక్కా, తలపైనిగుడ్డ, ఎల్లప్పుడు దగ్గరనుంచుకొను సటకా మాత్రమే. తలపైగుడ్డ జడవలె చుట్టి యెడమచెవిపైనుంచి వెనుకకు వ్రెలాడునట్లు వేసికొనువారు. వీనిని వారములతరబడి ఉతుకకుండ నుంచువారు. చెప్పులను తొడిగే వారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చొనేవారు. కౌపీనము ధరించువారు. చలిని వారించుటకు ధుని కెదురుగా యెడమచేయి కట్టడాపై వేసి దక్షిణాభిముఖముగా కూర్చుండువారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో రెండుగదుల స్థలము మాత్రముండెను. భక్తులంద రచటకు పోయి బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి దానిలో మార్పు కలిగెను. పాతమసీదు మరామతు చేసి నేలపైని నగిషీ రాళ్ళు తాపనచేసిరి. బాబా యా మసీదుకు రాకపూర్వము 'తకియా' (రచ్చ)లో చాలాకాలము నివసించిరి. బాబా కాళ్ళకు చిన్న మువ్వలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు; భక్తి పూర్వకమయిన పాటలు పాడేవారు.

నీళ్ళను నూనెగా మార్చుట

సాయిబాబాకు దీపములన్న చాల యిష్టము. ఊరులోనున్న షావుకార్లను నూనె యడిగి తెచ్చి మసీదునందు రాత్రియంతయు దీపములు వెలిగించుచుండెను. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. నూనె ఇచ్చుకోమట్లు అందరు కూడి బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటివలె పోగా నూనె లేదనిరి. బాబా కలత జెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో బెట్టియుంచెను. కోమట్లు ఆతురుతతో నిదంతయు గమనించుచుండిరి. రెండుమూడు నూనెచుక్కలున్న తంబిరేలు డొక్కులో నీళ్ళుపోసి దానిని బాబా త్రాగెను. నీటిని ఈ విధముగా పావనము చేసిన పిమ్మట, నీరంతయు డొక్కులోనుమ్మి, యా నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న కోమట్లు విస్మయమొందునట్లు ప్రమిదలన్నియు తెల్లవారుదాక చక్కగ వెలుగుచుండెను. షావుకార్లు ఇదంతయు జూచి పశ్చాత్తాపపడిరి; క్షమాపణ కోరిరి. బాబా వారిని క్షమించెను. ఇక మీదట సత్ప్రవర్తనమలవరచుకొనుడని పంపెను.

జౌహర్ అలీ యను కపటగురువు

పైన వివరించిన కుస్తీ జరిగిన యయిదేండ్ల తరువాత అహమదునగరు నుంచి జౌహర్ అలీ యను ఫకీరొకడు శిష్యులతో రహాతా వచ్చెను. వీరభద్రమందిరమునకు సమీపమున నున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకొన్నవాడు; ఖురానంతయు వల్లించగలడు, మధురభాషణుడు. ఆ యూరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా "ఈద్ గా" యను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగనాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్ గా. ఈ విషయములో కొట్లాట జరిగి జౌహర్ అలీ రహతా విడిచి, షిరిడీలో బాబాతో మసీదునందుండెను ప్రజలు వాని తీపిమాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా యందుల కడ్డుచెప్పక చేలాగ నుండుటకు సమ్మతించెను. గురువును శిష్యుడును రహతాకు పోయి యచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు చేలా శక్తి యేమియు తెలియకుండెను. కాని చేలాకు గురువుయొక్క లోపములు బాగా తెలియును. అయినప్పటికి వాని నెప్పుడు అగౌరవించలేదు. వాని పనులన్నియు చక్కగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు షిరిడీకి ఇరువురు వచ్చి పోవుచుండెడివారు. కాని షిరిడీ ప్రజలకు బాబా అధికముగా రహాతాలో నుండుట ఎంతమాత్ర మిష్టములేదు. అందుచే వారందరు కలసి రహాతానుంచి సాయిబాబాను షిరిడీకి తెచ్చుటకు పోయిరి. వారు రహాతాలో బాబాను ఈద్ గా వద్ద చూచి బాబాను తిరిగి షిరిడీ తీసికొనిపోవుటకై వచ్చినామని చెప్పిరి. ఫకీరు ముక్కోపి; చెడ్డవాడు. తనను విడిచిపెట్టడు గనుక ఫకీరు వచ్చులోపల వారు తనయందు ఆశ విడిచి తిరిగి షిరిడీ పోవుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుచుండగా ఫకీరు వచ్చి బాబాను తీసికొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలను మందలించెను. కొంత వివాదము జరిగిన పిమ్మట గురువుగారున్ను చేలాయు తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది.

కాబట్టి వారు షిరిడీ చేరి యచ్చట నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు కపటగురువును పరీక్షించి లోటుపాటు లనేకములున్నట్లు గనిపెట్టెను. బాబా షిరిడీ ప్రవేశించుటకు 12 సంవత్సరములు ముందు దేవీదాసు 10 లేదా 11 యేండ్ల బాలుడుగా షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయములో నుండేవారు. దేవీదాసు చక్కని ముఖ లక్షణములు, ప్రకాశించు నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారమువలె, జ్ఞానివలె కనపడుచుండెను. తాత్యా పాటీలు, కాశీనాథు మొదలుగాగల యనేకమంది దేవీదాసును గురువుగా మన్నించుచుండిరి. వారు జౌహరును దేవీదాసు వద్దకు తెచ్చిరి. జరిగిన వాదములలో తగిన సమాధానమివ్వలేక, జౌహరు ఓడిపోయి షిరిడీ విడిచి పారిపోయి, బీజాపురములో నుండెను. చాల యేండ్ల తరువాత షిరిడీకి తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను. తాను గురువు, సాయిబాబా చేలాయను తప్పుడు అభిప్రాయము వాని మనస్సునుండి తొలగెను. పశ్చాత్తాపపడుటచే సాయిబాబా వానిని గౌరవముగానే చూచెను. ఈ విధముగా బాబా, శిష్యుడు గురువు నెట్లు కొలువవలెనో యెట్లు అహంకారమును విడిచి గురుశుశ్రూశచేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో నిరూపించెను. ఈ కథ భక్త మహాళ్సాపతి చెప్పినరీతిగా వ్రాయబడినది.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
అయిదవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

Chapter 6

శ్రీ సాయి సత్ చరిత్రము
ఆరవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 6

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఆరవ అధ్యాయము

శ్రీరామ నవమి ఉత్సవము, మసీదు మరామతు

గురువుగారి కరస్పర్శ ప్రభావము - శ్రీరామనవమి యుత్సవము, దాని ప్రభావము, పరిణామము మొదలగునవి, మసీదు మరామతులు.

గురువుగారి హస్తలాఘవము

సంసారమను సముద్రములో జీవుడనే యోడను సద్గురువు నడుపునపుడు అది సులభముగాను జాగ్రత్తగాను గమ్యస్థానము చేరును. సద్గురువనగనే సాయిబాబా జ్ఞప్తికి వచ్చుచున్నారు. నాకండ్లయెదుట సాయిబాబా నిలచియున్నట్లు, నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయివేసి యాశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషములో మునిగి నా కండ్లనుండి ప్రేమ పొంగి పొరలు చున్నది. గురువుగారి హస్తస్పర్శ ప్రభావము అద్భుతమైనది. సూక్ష్మశరీరము (కోరికలు, భావముల మయము) అగ్నిచేకూడ కాలనట్టిది. గురువుగారి హస్తము తగులగనే కాలిపోవును; జన్మజన్మల పాపములు పటాపంచలై పోవును. మతవిషయములు భగవద్విషయములనగనే అసహ్యపడువారికి కూడ శాంతి కలుగును. సాయిబాబా చక్కని యాకారము చూడగనే సంతసము కలుగును. కండ్లనిండ నీరు నిండును, మనస్సు ఊహలతో నిండును. నేనేపరబ్రహ్మమునను చైతన్యమును మేల్కొల్పి ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును. నేను, నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మములో నైక్యము చేయును. వేదములుగాని, పురాణములుగాని పారాయణ చేయునప్పుడు శ్రీసాయి యడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. శ్రీసాయిబాబా రాముడుగా గాని, కృష్ణుడుగా గాని రూపము ధరించి తమ కథలు వినునట్లు చేయును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీసాయి యాపాదమస్తకము కృష్ణునివలె గాన్పించును. భాగవతమో, ఉద్ధవగీతయో పాడుచున్నట్లుగ అనిపించును. ఎవరితోనైన సంభాషించునపుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నేనేదైన వ్రాయ తలపెట్టినచో వారి యనుగ్రహము లేనిదే యొక్క మాటగాని వాక్యముగాని వ్రాయలేను. వారి యాశీర్వాదము లభించిన వెంటనే యంతులేనట్లు వ్రాయగల్గుదును. భక్తునిలో యహంకారము విజృంభించగనే బాబా దానిని యణచివేయును. తన శక్తితో వాని కోరికను నెరవేర్చి సంతుష్టుజేసి యాశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము జేసి సర్వస్యశరణాగతి చేసినవానికి ధర్మార్థకామమోక్షములు సిద్ధించును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి యను నాలుగు మార్గములు కలవు. అన్నింటిలో భక్తిమార్గము కష్టమైనది. దాని నిండ ముండ్లు గోతులుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని నడచినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. దీనిని గట్టిగా నమ్ముడని సాయిబాబా చెప్పుచుండెను.

స్వయంపుత్తాకమైన బ్రహ్మముయొక్క తత్వవిచారము చేసిన పిమ్మట, బ్రహ్మముయొక్క శక్తి (మాయ), బ్రహ్మసృష్టినిగూర్చి చెప్పి వాస్తవమునకీ మూడును నొకటియేయని సిద్ధాంతీకరించి, రచయిత బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములను ఈ క్రింద ఉదాహరించుచున్నాడు.

"నా భక్తుని యింటిలో అన్నవస్త్రములకు ఎప్పుడు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే యారాధించువారి యోగక్షేమముల నేను జూచెదను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడ ఇట్లనే చెప్పియున్నాడు. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీ కేమైన కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములో పేరుకీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణాకటాక్షములు పొందుటకు, భగవంతునిచే గౌరవమందుటకు యత్నించుము. ప్రపంచగౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవముయొక్క యాకారము నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని యారాధనకొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనునట్లు మనస్సును నిలుపుము. అప్పుడది శాంతి వహించి నెమ్మదిగాను, యెట్టి చికాకు లేక యుండును. అప్పుడే మనస్సు సరియైన సాంగత్యములో నున్నదని గ్రహింపుము. మనస్సు చంచలముగ నున్నచో దానికి ఏకాగ్రత లేనట్లే".

బాబా మాటలుదాహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవమును వర్ణించుటకు మొదలిడెను. షిరిడీలో జరుగు నుత్సవము లన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. కావున సాయిలీల (1925 - పుట 197) పత్రికలో విపులముగ వర్ణింపబడిన శ్రీరామనవమి యుత్సవముల సంగ్రహ మిచట పేర్కొనబడుచున్నది.

కోపర్ గాం లో గోపాలరావుగుండ్ అనునతడు పోలీసు సర్కిలు ఇన్స్పెక్టరుగా నుండెను. అతడు బాబాకు గొప్పభక్తుడు. అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికి సంతానము కలుగలేదు. శ్రీ సాయి యాశీర్వచనముచే అతనికొక కొడుకు బుట్టెను. దానికాతడు మిక్కిలి సంతసించి షిరిడీలో నుత్సవము చేసిన బాగుండునని 1897లో భావించెను. ఈ విషయమై తక్కిన భక్తులగు తాత్యాపాటీలు, దాదా కోతేపాటీలు, మాధవరావు దేశపాండేలతో సంప్రదించెను. వారంతా దీనికి సమ్మతించిరి. బాబా యాశీర్వాదమును, అనుమతిని పొందిరి. జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకరణము దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా యాశీర్వదించియుండుటచే రెండవపర్యాయము ప్రయత్నించగా వెంటనే యనుమతి వచ్చెను. సాయిబాబాతో మాట్లాడిన పిమ్మట ఉత్సవము శ్రీరామనవమినాడు చేయుటకు నిశ్చయించిరి. దానిలో బాబావారికేదో యింకొక ఉద్దేశమున్నట్లు కనుపించుచున్నది. ఈ యుత్సవమును శ్రీ రామనవమితో కలుపుట, హిందువుల మహమ్మదీయుల మైత్రికొరకు కాబోలు. భవిష్యత్సంఘటనలను బట్టి చూడగా బాబా యుద్దేశములు రెండును నెరవేరినవి.

ఉత్సవములు జరుపుటకు అనుమతి వచ్చెనుగాని యితర కష్టములు గాన్పించెను. షిరిడీ చిన్న గ్రామమగుటచే నీటి యిబ్బంది యెక్కువగా నుండెను. గ్రామమంతటికి రెండు నూతులుండెడివి. ఒకటి యెండాకాలములో నెండిపోవుచుండును. రెండవదానిలోని నీళ్ళు ఉప్పనివి. ఈ ఉప్పునీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీళ్ళబావిగా మార్చెను. ఈ నీరు చాలకపోవుటచే తాత్యాపాటీలు దూరమునుంచి మోటలద్వారా నీరు తెప్పించెను. అప్పటికి మాత్రమే పనికివచ్చునట్లు అంగళ్ళు వేసిరి. కుస్తీల కొరకేర్పాటు చేసిరి.

గోపాలరావుగుండున కొకస్నేహితుడు గలడు. వాని పేరు దాము అణ్ణా కాసార్. అతనిది అహమద్ నగరు. ఆతనికి కూడ ఇద్దరు భార్యలున్నప్పటికి సంతానము లేకుండెను. అతనికి కూడ బాబా యాశీర్వాదముతో పుత్రసంతానము గలిగెను. ఉత్సవముకొరకు ఒక జండా తయారు చేయించెను. అట్లనే నానాసాహెబు నిమోన్కరును ప్రబోధించగా అతడు కూడ ఒక నగిషీజండా నిచ్చుటకు ఒప్పుకొనెను. ఈ రెండుజండాలు ఉత్సవముతో తీసికొనిపోయి మసీదు రెండుమూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికిని అవలంబించుచున్నారు. బాబా యుండు మసీదుకు ద్వారకామాయి యని పేరు.

చందన ఉత్సవము

ఈ ఉత్సవములో నింకొక ఉత్సవము కూడ ప్రారంభమయ్యెను. కొరాహ్లే గ్రామమందు అమీరు షక్కర్ అను మహమ్మదీయ భక్తుడు గలడు. అతడు చందన ఉత్సవము ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెములో చందనపు ముద్దనుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజాభజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవమూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను, గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు. మొదటి మూడు సంవత్సరములు ఈ యుత్సవము అమీరుషక్కరు జరిపెను. పిమ్మట అతని భార్య జరిపెను. ఒకేదినమందు పగలు హిందువులచే జండాయుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ కొట్లాటలు లేక జరుగుచున్నవి.

ఏర్పాట్లు

శ్రీరామనవమి బాబాభక్తులకు ముఖ్యమైనది; పవిత్రమైనది. భక్తులందరు వచ్చి ఈ యుత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నియు తాత్యాకోతే పాటీలు చూచుకొనెడివారు. ఇంటిలోపల చేయవలసినవన్నియు రాధాకృష్ణమాయి యను భక్తురాలు చూచుచుండెను. ఆమె యింటినిండ భక్తులు దిగేవారు. ఆమె వారికి కావలసినవన్నియు సమకూర్చుచుండెను. ఉత్సవమునకు కావలసినవన్నియు సిద్ధపరచుచుండెను. ఆమె స్వయముగా మసీదును శుభ్రపరచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదుగోడలు బాబా వెలిగించు ధునిమూలముగా మసితో నిండియుండెడివి. వానిని చక్కగా కడిగి సున్నము పూయుచుండెను. ఒక్కొక్కప్పుడు మండుచున్న ధునికూడ తీసి బయట పెట్టుచుండెను. ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజుముందే చేయుచుండెను. బీదలకు అన్నదానమనగా బాబాకు చాలప్రీతి. అందుచే బీదలకు అన్నదానము ఈ యుత్సవముయందు విరివిగా చేయుచుండిరి. వంటలు విస్తారముగ, మిఠాయిదినుసులతో రాధాకృష్ణమాయి ఇంటిలో చేయుచుండిరి. ఇందులో అనేకమంది భక్తులు పూనుకొనుచుండెడివారు.

మేళా లేదా ఉత్సవమును శ్రీరామనవమి ఉత్సవముగా మార్చుట

ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉత్సవము వైభవముగా జరుగుచుండెను. రాను రాను వృద్ధియగుచుండెను. 1912లో నొక మార్పుజరిగెను. "సాయి సగుణోపాసన"ను వ్రాసిన కవియగు కృష్ణారావు జోగేశ్వర భీష్మయనువాడు దాదాసాహెబు ఖాపర్డే (అమరావతి నివాసి)తో నుత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడలో బసచేసిరి. కృష్ణారావు వసారాలో చేరగిలి యుండగా కాకామహాజని పూజాపరికరముల పళ్ళెముతో మసీదుకు పోవుచుండగా అతనికి ఒక క్రొత్తయాలోచన తట్టెను. వానిని పిలిచి యిట్లనెను. "ఈ యుత్సవమును శ్రీరామనవమినాడు చేయుటలో భగవదుద్దేశ మేదియో యుండవచ్చును. శ్రీరామనవమి యుత్సవమనగా హిందువులకు చాల ముఖ్యము. కనుక యీ దినమందు శ్రీరామనవమి యేల జరుపకూడ"దని యడిగెను. కాకామహాజని యీ యాలోచనకు సమ్మతించెను. బాబా యనుమతి దెచ్చుటకు నిశ్చయించిరి. ఒక కష్టము మాత్రము తీరనిదిగా గాన్పించెను. అది హరిదాసును సంపాదించుట. భగవన్మహిమలను కీర్తనచెయుటకు హరిదాసు నెచ్చటనుండి తేవలెననునది గొప్ప సమస్యగా నుండెను. తుదకది భీష్ముడే పరిష్కరించెను. ఎట్లన, అతని రామాఖ్యానమను శ్రీ రాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే నతడు దానిని కీర్తన చేయుటకు, కాకామహాజని హార్మోనియం వాయించుటకు నిశ్చయించిరి. చక్కెరతో కలిపిన శొంఠిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట కేర్పాటయ్యెను. బాబా యనుమతి బొందుటకై మసీదుకు పోయిరి. అన్నిసంగతులు మసీదునందుండియే గ్రహించుచున్న బాబా వాడలో నేమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా యడిగిన ప్రశ్నను మహాజని గ్రహించలేకపోవుటచే బాబా యదేప్రశ్న భీష్ముడనడిగెను. అతడు శ్రీరామ నవమి యుత్సవము చేయ నిశ్చయించితి మనియు నందులకు బాబా యనుమతి నివ్వవలెననియు కోరెను. బాబా వెంటనే యాశీర్వదించెను. అందరు సంతసించి జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటిదినమున మసీదు నలంకరించిరి. బాబా ఆసనమునకు ముందు ఊయల వ్రేలాడగట్టిరి. దీనిని రాధాకృష్ణమాయి ఇచ్చెను. శ్రీరామజన్మోత్సవము ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. అప్పుడే లెండీ వనమునుండి మసీదుకు వచ్చిన బాబా, అదంతయు చూసి మహాజనిని పిలిపించెను. అతడు కొంచెము జంకెను. జన్మోత్సవము జరుపుటకు బాబా యొప్పుకొనునో లేదో యని అతడు సంశయించెను. అతడు బాబావద్దకు వెళ్ళిన తోడనే యిదినంతయు యేమని బాబా యడిగెను. ఆ ఊయల యెందుకు కట్టిరని యడిగెను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులోనుండు భగవంతుని నిర్గుణస్వరూపమగు 'నింబారు' (గూడు) నుండి యొక పూలమాలను తీసి మహాజని మెడలో వేసి యింకొకటి భీష్మునకి పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. కొంతసేపటికి కథ ముగిసెను. 'శ్రీ రామచంద్రమూర్తికీ జై' యని ఎర్రగుండ బాజాభజంత్రీల ధ్వనుల మధ్య అందరిపైన బడునట్లు విరివిగా జల్లిరి. అందరు సంతోషములో మునిగిరి. అంతలో నొకగర్జన వినబడెను. చల్లుచుండిన గులాల్ యను ఎర్రపొడుము ఎటులనో బాబా కంటిలో పడెను. బాబాకోపించిన వాడై బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. జనులందరు ఇది చూచి భయపడి పారిపోయిరి. కాని బాబా భక్తులు, అవన్నియు తిట్ల రూపముగా తమకిచ్చిన బాబా యాశీర్వాదములని గ్రహించి పోకుండిరి. శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు రావణుడనే యహంకారమును, దురాలోచనలను చంపుటకై నిశ్చయముగా బాబారూపములోనున్న రాముడు తప్పక కోపించవలెననిరి. షిరిడీలో ఏదైన క్రొత్తది ప్రారంభించునపుడెల్ల బాబా కోపించుట యొక యలవాటు. దీనిని తెలిసినవారు గమ్మున నూరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని బిలిచి ఊయలను దీసికొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతనివద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నుత్సవము పూర్తి కానందున బాబా దానిని విప్పవద్దని చెప్పి యా మరుసటిదినము శ్రీకృష్ణజననమునాడు పాటించు 'కాలాహండి' యను నుత్సవము జరిపినపిమ్మట తీసివేయవచ్చునని చెప్పెను. కాలాహండి యనగా నల్లనికుండలో అటుకులు, పెరుగు, ఉప్పుకారముకలిపి వ్రేలాడ గట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగనే తన స్నేహితులగు గొల్లపిల్లవాండ్రకు పంచి పెట్టుచుండెను. ఆ మరుసటిదినము ఇవన్నియు పూర్తియైనపిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవమును శ్రీరామనవమి ఉత్సవసమయమందు గొప్ప వైభవముగా జరుగుచుండెను. అప్పటినుండి జాతర (మేళ) శ్రీరామనవమి యుత్సవముగా మారెను.

1913 నుంచి శ్రీరామనవమి యుత్సవములోని యంశములు హెచ్చించిరి. చైత్రపాడ్యమినుంచి రాధాకృష్ణమాయి 'నామసప్తాహము' ప్రారంభించుచుండెను. భక్తులందరు అందు పాల్గొందురు. ఆమె కూడ వేకువజామున భజనలో చేరుచుండెను. దేశమంతట శ్రీరామనవమి ఉత్సవములు జరుగుటచే హరికథాకాలక్షేపము చేయు హరిదాసు చిక్కుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5, 6 రోజులు ముందు మహాజని బాలబువ మాలీని (ఆధునిక తుకారామ్) కలిసియుండుటచే కీర్తన చేయుటకు వారిని తోడ్కొనివచ్చెను. ఆ మరుసటి సంవత్సరము అనగా 1914లో సతారాజిల్లా బిర్హాడ్ సిద్ధకవఠె గ్రామములోని హరిదాసుడగు బాలబువ సతార్కర్ స్వగ్రామములో ప్లేగు వ్యాపించియుండుటచేత కథలు చెప్పక ఖాళీగానుండెను. బాబా యనుమతి కాకా ద్వారా పొంది అతడు షిరిడీ చేరెను. హరికథ చెప్పెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. ప్రతి సంవత్సరము ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు ఈ సమస్యను 1914వ సంవత్సరములో శ్రీ సాయి పరిష్కరించెను. ఈపని శాశ్వతముగా దాసగణు మహారాజునకు అప్పగించెను. ఈనాటివరకు దాసగణు ఈ కార్యమును జరుపుచున్నారు.

1912 నుండి ఈ యుత్సవము రానురాను వృద్ధిపొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తుమ్మెదల పట్టువలె ప్రజలతో నిండుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీలలో ననేకమంది పాల్గొనుచుండిరి. బీదలకు అన్న సంతర్పణ బాగుగ జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే శ్రీసాయిసంస్థాన మేర్పడెను. అలంకారములు; ఆడంబరము లెక్కువాయెను. అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రథము, పాత్రలు, వెండిసామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులుకూడ వచ్చెను. ఇవన్నియు హెచ్చినప్పటికి సాయిబాబా వీనిని లెక్కించేవారు కారు. ఈ యుత్సవములో గమనింపవలసిన ముఖ్యవిషయమేమన హిందువులు, మహమ్మదీయులు కలసిమెలసి యెట్టి కలహములు లేకుండ గడిపేవారు. మొదట 5,000 మొదలు 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. తుదకు 75,000 వరకు రాజొచ్చిరి. అంతమంది గుమిగూడినప్పిటికి ఎన్నడైనను వ్యాధులుకాని జగడములుగాని కనిపించలేదు.

మసీదు మరామతులు

గోపాలరావుగుండునకు ఇంకొక మంచియాలోచన తట్టెను. ఉత్సవములు ప్రారంభించినట్లే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదుమరామతుచేయ నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించెను. కాని ఈపని బాబా అతనికి నియమించలేదు. ఈ పని నానాసాహెబు చాందోర్కరుకు, రాళ్ళుతాపన కాకాసాహెబు దీక్షిత్ కు నియోగించెను. ఈ పనులు చేయించుట బాబా కిష్టము లేకుండెను. కాని భక్తుడగు మహళ్సాపతి కల్గించుకొనుటవలన బాబా యనుమతి నిచ్చెను. బాబా చావడిలో పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళచే తాపనచేయుట ముగించిరి. అప్పటినుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్నపరుపుమీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 వ సంపత్సరములో సభామండపము పూర్తిచేసిరి. మసీదుకు ముందున్న జాగా చాల చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబు దీక్షిత్ దానిని విశాలపరచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బుపెట్టి యినుపస్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రియంతయు శ్రమపడి స్తంభములు నాటిరి. ఆ మరుసటిదినము ప్రాతఃకాలముననే బాబా చావడినుండి వచ్చి యది యంతయు జూచి కోపించి వానిని పీకి పారవైసెను.

ఆసమయమందు బాబా మిక్కిలి కోపోద్ధీపితుడయ్యెను. ఒకచేతితో ఇనుపస్తంభము బెకిలించుచు, రెండవచేతితో తాత్యాపాటీలు పీకను బట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా దీసి, యగ్గిపుల్లతో నిప్పంటించి, యొక గోతిలో పారవైచెను. బాబా నేత్రములు నిప్పుకణములవలె వెలుగుచుండెను. ఎవరికిని బాబావైపు చూచుటకు ధైర్యము చాలకుండెను. అందరు భయకంపితులైరి. బాబా తన జేబులోనుంచి ఒక రూపాయి తీసి యటువైపు విసరెను. అది శుభసమయమందు చేయు యాహుతివలె కనబడెను. తాత్యాకూడ చాలా భయపడెను. తాత్యాకేమి జరుగుచున్నదో ఎవరికి ఏమియు తెలియకుండెను. అందులో కల్పించుకొనుట కెవ్వరికి ధైర్యము లేకుండెను. కుష్ఠురోగియు బాబా భక్తుడునగు భాగోజి శిందియా కొంచెము ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసెను. మాధవరావు ప్రయత్నించగా వానిపై బాబా ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది జోలికి పోదలచిరో అందరికి యొకేగతి పట్టెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను, ఒక దుకాణదారుని పిలిపించెను. వానివద్దనుంచి జరీపాగాను క్రయమునకు దీసికొనెను, దానిని బాబా స్వయముగా తాత్యాతలకు చుట్టెను. తాత్యాను ప్రత్యేకముగా గౌరవించుటకు బాబా యిట్లు చేసియుండెను. బాబాయొక్క యీ వైఖరిని జూచినవా రెల్లరు నాశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబా కెట్లు కోపము వచ్చెను? ఎందుచేత నీ విధముగా తాత్యాను శిక్షించెను? వారికొపము తత్ క్షణమే ఎట్లు చల్లబడెను? అని యందరు ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తివలె గూర్చిండి యత్యంతానురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో నకారణముగా కొపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కాని యేది చెప్పవలెనను విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్ల ఒక్కొక్కటి చెప్పెదను.

ఓం నమోః శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఆరవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

Chapter 7

శ్రీ సాయి సత్ చరిత్రము
ఏడవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 7

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఏడవ అధ్యాయము

అద్భుతావతారము; సాయిబాబా వైఖరి; వారి యోగాభ్యాసము; వారి సర్వాంతర్యామిత్వము; కుష్ఠుభక్తుని సేవ; ఖాపర్డేకొడుకు ప్లేగు సంగతి; పండరీపురము పోవుట.

అద్భుతావతారము

సాయిబాబాకు యోగాభ్యాసము లన్నియు తెలిసియుండెను. షణ్మార్గములందును బాబా ఆరితేరినవారు. అందులో కొన్ని ధౌతి, ఖండయోగము, సమాధి మొదలగునవి. ధౌతి యనగా 3 అంగుళముల వెడల్పు, 22 1/2 అడుగుల పొడవుగల తడిగుడ్డతో కడుపును లోపల శుభ్రపరచుట. ఖండయోగమనగా శరీరావయములన్నియు విడదీసి తిరిగి కలుపుట.

బాబా హిందువన్నచో వారు మహమ్మదీయ దుస్తులతో నుండెడివారు. మహమ్మదీయుడన్నచో హిందూమతాచార సంపన్నుడుగ గాన్పించుచుండెను. బాబా శాస్త్రోక్తముగ హిందువుల శ్రీరామనవమి యుత్సవమును జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ యుత్సవసమయమందు కుస్తీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచినవారికి బహుమతులిచ్చువారు. గోకులాష్టమినాడు "గోపాల్ కాలా" యుత్సవము జరిపించుచుండెను. ఈదుల్ ఫితర్ పండుగనాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించుచుండెడివారు. మోహర్రం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజీయా లేక తాబూతు నిల్పి కొన్ని దినములు దాని నచ్చట నుంచినపిమ్మట గ్రామములో నూరేగించెదమనిరి. నాలుగు దినములవరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి యయిదవనాడు నిర్విచారముగ ఏ సంశయము లేక దానిని తానే తీసివేసెను. వారు మహమ్మదీయులన్నచో హిందువుల వలె వారి చెవులకు కుట్లుండెను. వారు హిందువులన్నచో సున్తీ చేసికొనుమని సలహా నిచ్చుచుండెడివారు. కాని వారు మాత్రము సున్తీ చేసికొనియుండలేదు. బాబా హిందువైనచో మసీదునందేల యుండును? మహమ్మదీయుడైనచో ధునియు అగ్నిహోత్రమును ఏల వెలిగించియుండువారు? అదేగాక మహమ్మదీయమతమునకు వ్యతిరేకముగా తిరుగలితో విసరుట, శంఖమూదుట, గంటవాయించుట, హోమముచేయుట, భజన చేయుట, సంతర్పణ చేయుట, అర్ఘ్యపాద్యములు సమర్పించుట మొదలగునవి జరుగుచుండెను. వారే మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచారపారాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారము లెట్లు చేయుచుండెడివారు? వారేతెగవారని యడుగబోయిన వారెల్లరు వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువుడో మహమ్మదీయుడో ఎవరును సరిగా నిర్ణయించలేకుండిరి. ఇదియొక వింత కాదు. ఎవరయితే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్యశరణాగతి యొనరించెదరో వారు దేవునిలో నైక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధముగాని, భేదభావముగాని యుండదు. వారికి జాతిమతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము గన్పించకుండెను. బాబా ఫకీరులతో కలిసి మత్స్యమాంసములు భుజించుచుండెను. కాని వారి భోజనపళ్ళెములో కుక్కలు మూతిపెట్టినను నడుగువారు కారు.

శ్రీ సాయి యవతారము విశిష్టమైనది; యద్భుతమైనది. నా పూర్వజన్మసుకృతముచే వారి పాదములవద్ద కూర్చొను భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా యదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన యానందము ఉల్లాసము చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు మోక్షమునకై పాటుపడు తదితరు లనేకమంది సాయిబాబా వద్దకు వచ్చెడివారు. బాబా వారితో నడచుచు, మాట్లాడుచు, నవ్వుచు అల్లా మాలిక్ యని యెల్లప్పుడు పలుకుచుండెడివారు. వారికి వివాదములుగాని, చర్చలుగాని యిష్టము లేదు. అప్పుడప్పుడు కోపించినప్పటికి వారెల్లప్పుడు నెమ్మదిగానుండి శరీరమును పూర్తిగా స్వాధీనములో నుంచు కొనెడివారు. ఎల్లప్పుడు వేదాంతమును బోధించుచుండెడివారు. ఆఖరువరకు బాబా యెవరో ఎవరికి తెలియనేలేదు. వారు రాజులను, భిక్షుకులను నొకేరీతిగా ఆదరించిరి. అందరి యంతరంగములందు గల రహస్యములన్ని బాబా యెరింగెడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగనే యందరు ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞు లయినప్పటికి ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి అయిష్టము. సాయిబాబా నైజమట్టిది. మానవశరీరముతో నున్నప్పటికి వారు చేయు పనులను జూడ సాక్షాత్తు భగవంతుడని చెప్పవలెను. అందరును వారిని జూచి షిరిడీలో వెలసిన భగవంతుడనియే యనుకొనుచుండిరి.

సాయిబాబా వైఖరి

నేను వట్టి మూర్ఖుడనగుటచే బాబా మహిమలను వర్ణించలేను. బాబా షిరిడీలోనున్న దేవాలయములన్నిటిని మరామతు చేయించెను. తాత్యాపాటీలు సహాయముతో గ్రామములోనున్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతీదేవాలయముల మరామతు చేయించెను. వారి దానము పొగడబడినది. దక్షిణరూపముగా వసూలయిన పైకమంతయు నొక్కొక్కరికి రోజు కొక్కంటికి రూ. 50/- 30/- 15/- చొప్పున ఇష్టము వచ్చినట్లు పంచిపెట్టెడివారు.

బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభము పొందువారు. కొందరు ఆరోగ్యవంతు లగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. కంటిలో రసముగాని మందుగాని వేయకనే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను; కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును, పారమును ఎవ్వరును కనుగొనకుండిరి. వారి కీర్తి చాల దూరమువరకు వ్యాపించెను. అన్నిదేశముల భక్తులు షిరిడీలో గుమిగూడుచుండిరి. బాబా ఎల్లప్పుడు ధునివద్దనే ధ్యానమగ్నులయి కూర్చొనుచుండెను. ఒక్కొక్కప్పుడు స్నానము కూడ మానెడివారు.

తొలిదినములలో బాబా తెల్ల తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించువారు. మొదట గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చెడివారు. వారి చేతితో నిచ్చిన మందులు పనిచేయుచుండెడివి. మంచి హస్తవాసిగల డాక్టరని పేరు వచ్చెను. ఈ సందర్భమున నొక వింత విషయము చెప్పవలెను. ఒక భక్తుని కండ్లు వాచి మిక్కిలి యెర్రబడెను. షిరిడీలో డాక్టరు దొరకలేదు. ఇతరభక్తు లాతనిని బాబావద్దకు గొనిపోయిరి. అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన యౌషధములు డాక్టర్లు ఉపయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విశిష్టమైనది. నల్ల జీడిగింజలను నూరి రెండు మాత్రలు చేసి యొక్కొక్క కంటిలో నొక్కొక్కదానిని దూర్చి గుడ్డతో కట్టుకట్టెను. మరుసటి దినము కట్టులను విప్పి నీళ్ళను ధారగా పోసెను. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడిపిక్కలమందు పెట్టినప్పుడు సున్నితమైన కండ్లు మండనేలేదు. అటువంటి చిత్రము లనేకములు గలవు. కాని యందు ఒకటి మాత్రమే చెప్పబడినది.

బాబా యోగాభ్యాసములు

బాబాకు యోగములన్నియు దెలియును. కాని యందులో రెండు మాత్రమే వర్ణింపడెను.

1. ధౌతి లేక శుభ్రపరచు విధానము
మసీదుకు చాల దూరమున ఒక మఱ్ఱిచెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి మూడవరోజు బాబా యచ్చటకు పోయి ముఖప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఒకనాడు బాబా తన యూపిరి తిత్తులను బయటకు కక్కి వాటిని నీటితో శుభ్రపరచి నేరేడుచెట్టుపై ఆరవేయుట కొందరు గమనించిరి. షిరిడీలోని కొందరు దీనిని కండ్లార చూచి చెప్పిరి. మామూలుగా ధౌతియనగా 3 అంగుళముల వెడల్పు 22 1/2 అడుగుల పొడవుగల గుడ్డను మ్రింగి కడుపులో అరగంటవరకు నుండనిచ్చిన పిమ్మట తీసెదరు. కాని బాబాగారి ధౌతి చాల విశిష్టము, అసాధారణము నైనది.

2. ఖండయోగము
బాబా తన శరీరావయము లన్నియు వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడొక పెద్దమనిషి మసీదుకు పోయి బాబా యవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీచేసిర నుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదుచేయ నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయముగుర్చి కొంచమైన తెలిసియుండునని తననే అనుమానించెదరని యూరకొనెను. మరుసటిదినమతడు మసీదుకు బోయెను. బాబా యెప్పటివలె హాయిగా కూర్చొనియుండుట జూచి యాశ్చర్యపడెను. ముందుదినము తాను చూచినదంతయు స్వప్నమనుకొనెను..

3. యోగము
బాల్యమునుంచి బాబా యోగాభ్యాసము చెయుచుండెను. దానిలో వారెంత నిష్ణాతులో యెవరికీ తెలియదు. వారి ఊదీ ప్రసాదము వల్ల బాగుపడిన రోగులవద్దనుంచి డబ్బు పుచ్చుకొనక యుచితముగానే సేవ చేయుచుండిరి. అనేకమందిని యారోగ్యవంతులుగ జేసిరి. వారు చేయు పుణ్యకార్యములబట్టి వారికి గొప్పకీర్తి వచ్చెను. బాబా సొంతము కొరకు ఏమియు చెయక యితరుల మేలుకొరకే యెల్లప్పుడు పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తనపై వేసికొని తాము మిక్కిలి బాధ ననుభవించేవారు. అందులో నొకటి యీ దిగువ పేర్కొందును. దీనినిబట్టి బాబా సర్వజ్ఞుడనియు మిక్కిలి దయార్ద్రహృదయుడనియు తెలియును.

బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము

1910వ సంవత్సరము దీపావళి పండుగనాడు బాబా ధునివద్ద కూర్చుండి చలి కాగుచుండెను. బాబా ధునిలో కట్టెలు వేయుచుండెను; ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపయిన తరువాత కట్టెలను వేయుట మాని తనచేతిని ధునిలో పెట్టెను. వెంటనే చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండేయు దీనిని జూచిరి. వెంటనే పరుగెత్తి బాబాను పట్టి వెనుకకు లాగిరి. దేవా! ఇట్లేల చేసితిరని యడిగిరి. స్పృహ తెచ్చుకొని బాబా యిట్లు జవాబిచ్చెను. "దూరదేశమున ఒక కమ్మరి భార్య కొలిమితిత్తులను ఊదుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తనయొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచి పరుగిడజొచ్చెను. ఆ బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. అందుచేత వెంటనే నాచేతిని కొలిమిలోనికి దూర్చి బిడ్డను రక్షించితిని. నా చేయి కాలుట నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నా కానందము గలుగచేయుచున్న" దని బాబా నుడివెను.

కుష్ఠురోగభక్తుని సేవ

బాబా చెయ్యి కాల్చుకొనెనని మాధవరావు దేశపాండే నానా సాహెబు చాందోర్కరుకు తెలియజేసెను. వెంటనే ఆయన బొంబాయి నుండి డాక్టరు పరమానందుని మందుల పెట్టెతో వెంటబెట్టుకొని వచ్చెను. నానా బాబాను చికిత్స చేయుటకై డాక్టరును చేయి చూడనిమ్మని కోరెను. బాబా యందుల కొప్పుకొనలేదు. చేయి కాలిన లగాయితు బాగోజీశిందే యను కుష్ఠురోగియే కట్టు కట్టుచుండెను. కాలిన చేతిపైన నెయ్యి రాసి, యాకు వేసి, గుడ్డతో కట్టు కట్టెడివాడు. నానా యెంత వేడినను బాబా డాక్టరుగారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టరుగారుకూడ అనేకసారులు వేడుకొనిరి. కాని అల్లాయే తన డాక్టరని బాబా కాలయాపన చేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూతయైన తీయకుండనే తిరిగిపోయెను. కాని డాక్టరుగారికి బాబా దర్శనభాగ్యము లభించెను. బాబా ప్రతిరోజు భాగోజీ చే చేతికి కట్టు కట్టించుకొనుచుండెను. కొన్నిదినముల తరువాత చేయి బాగుపడెను. అందరు సంతోషించిరి. ఇప్పటికిని ఏమైన నొప్పి మిగలిపోయినదా యను సంగతి యెవరికి తెలియదు. ప్రతిరోజు ఉదయము భాగోజీ కట్టులను విప్పి, నేతితో తోమి, తిరిగి కట్టులను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను. బాబా సిద్ధపురుషుడగుటచే వారి కిదంతయు నవసరములేనప్పటికి భాగోజీ భక్తునియందు గల ప్రేమచే అతడొనర్చు ఉపాసనాసేవకు సమ్మతించెడివారు. బాబా లెండితోటకు పోవునపుడు భాగోజి బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట వెళ్ళేవాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధునియొద్ద కూర్చొనగనే, భాగోజి తన సేవాకార్యము మొదలిడువాడు. గతజన్మయందు భాగోజి పాపి, కనుకనే కుష్ఠురోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు, దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు దురదృష్టవంతునివలె గాన్పించునప్పటికి అతడు అదృష్టశాలియు, సంతోషియు. ఎందుకనగా అతడు బాబాసేవకులందరిలో మొదటివాడు; బాబా సహవాసము పూర్తిగా ననుభవించెను.

ఖాపర్డే కుర్రవాని ప్లేగు జాడ్యము

బాబా విచిత్ర లీలలలో నింకొకదానిని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో షిరిడీలో మకాం చేసెను. కొడుకుకు జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బుట్టీవాడావద్దకు వచ్చుచున్నప్పుడు వారి సెలవు నడుగ బోయెను. వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా యామెతో కారుణ్యముతో, నెమ్మదిగా మాట్లాడదొడగెను. ప్రస్తుతము ఆకాశము మేఘములచే కప్పబడియున్నది గాని యవి చెదిరి పోయి కొద్దిసేపట్లో నాకాశమంతయు మామూలు రీతిగా నగునని బాబా యోదార్చెను. అట్లనుచు తన కఫనీని పైకెత్తి చంకలో కోడి గ్రుడ్లంత పెద్దవి నాలుగు ప్లేగు పొక్కులను అచటవారికి జూపెను. "చూచితిరా! నా భక్తులకొరకు నే నెట్లు బాధపడెదనో! వారి కష్టములన్నియు నావిగనే భావించెదను." ఈ మహాద్భుతలీలలను జూచి యోగీశ్వరులు భక్తులకొర కెట్లు బాధ లనుభవింతురో జనులకు విశ్వాసము కుదిరెను. యోగీశ్వరుల మనస్సు మైనముకన్న మెత్తనిది, వెన్నెలవలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారము కోరకయే ప్రేమించెదరు. భక్తులను తమ బంధువులవలె జూచెదరు.

పండరీపురము పోయి యచ్చటుండుట

సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను, అవసరముల నెట్లు గ్రహించుచుండెనో యను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని నందురుబారులో మామలతదారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ జరిగెను. సాయిబాబా యందు అతనికిగల భక్తియను ఫలమానాటికి పండెను. పండరీపురమును భూలోకవైకుంఠ మనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నాతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి యుండెను. కాన షిరిడీకి ఉత్తరము వ్రాయకయే పండరీపురము పోవలెనని బయలుదేరెను. షిరిడీకి హఠాత్తుగా పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి పండరి పోవలె ననుకొనెను. నానాసాహెబు షిరిడీ వచ్చునను సంగతి యెవరికి తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నీమగాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము కలిగెను. బాబా మసీదులో కూర్చుండి మహాళ్సాపతి, అప్పాశిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. వెంటనే బాబా యిట్లనియెను. "మన నలుగురము కలసి భజన చేసెదము. పండరీద్వారములు తెరచినారు. కనుక ఆనందముగా పాడెదము లెండు." అందరు కలసి పాడదొడంగిరి. ఆ పాట భావమేమన, "నేను పండరి పోవలెను. నే నక్కడ నివసించవలెను. అది నా దైవము యొక్క భవనము."

బాబా పాడుచుండెను. భక్తులందరు బాబాను అనుగమించిరి. కొద్ది సేపటికి నానా కుటుంబముతో వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి, బాబాను పండరీపురము వచ్చి వారితో కలసి యక్కడుండుమని వేడుకొనియెను. ఈ బతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా యప్పటికే పండరి పోవలెను; అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబాయొక్క ఆజ్ఞను పొంది ఊదీ ప్రసాదమును గ్రహించి, ఆశీర్వాదమును పొంది నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఏడవ అధ్యాయము సంపూర్ణము.

మొదటిరోజు పారాయణము సమాప్తము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

Chapter 8

శ్రీ సాయి సత్ చరిత్రము
ఎనిమిదవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 8

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

(రెండవరోజు పారాయణ - శుక్రవారము)

ఎనిమిదవ అధ్యాయము

మానవజన్మ ప్రాముఖ్యము; సాయిబాబా భిక్షాటనము; బాయిజా బాయి సేవ; సాయిబాబా పడక జాగా; కుశాల్ చంద్ పై వారి ప్రేమ.

మానవజన్మయొక్క ప్రాముఖ్యము

ఈ యద్భుత విశ్వమందు భగవంతుడు కోట్లకొలది జీవులను సృష్టించి యున్నాడు. దేవతలు, వీరులు, జంతువులు, పురుగులు, మనుష్యులు మొదలగువానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి యంతయు సృష్టించెను. వీరిలో నెవరిపుణ్య మెక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము ననుభవించిన పిమ్మట త్రోసి వేయబడుదురు. ఎవరిపాప మెక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్టు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్షసాధనమునకై యవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించునపుడు వారికి మోక్షము కలుగును. వేయేల? మోక్షముగాని, పుట్టుకగాని వారువారు చేసికొనిన కర్మపై ఆధారపడి యుండును.

మానవశరీరముయొక్క ప్రత్యేక విలువ

జీవకోటి యంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవున కివిగాక యింకొక శక్తిగలదు. అదియే జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందును దీని కవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు కూడ మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడ భూమిపై మానవజన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు.

కొంతమంది మానవజన్మము చాల నీచమైనదనియు; చీము, రక్తము, మురికితో నిండియుండు ననియు; తుదకు శిథిలమయి రోగమునకు మరణమునకు కారణమగునందరు. కొంతవర కదికూడ నిజమే. ఇన్ని లోటులున్నప్పటికి మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. మానవ శరీరమునుబట్టియే జన్మ యశాశ్వతమని గ్రహించుచున్నాడు. ఈ ప్రపంచ మంతయు మిధ్యయని, విరక్తి పొందును. ఇంద్రియసుఖములు అనిత్యములు, అశాశ్వతములని గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుగొని, యనిత్యమును విసర్జించి తుదకు మోక్షమునకై మానవుడు సాధించును. శరీరము మురికితో నిండియున్నదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదము. శరీరమును ముద్దుగా పెంచి, విషయసుఖములకు మరిగినచో నరకమునకు పోయెదము. మనము నడువవలసిన త్రోవ యేదన; శరీరము నశ్రద్ధ చేయకూడదు. దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. గుర్రపురౌతు తన గమ్యస్థానము చేరువరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో యంతజాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. ఈ శరీరము మోక్షము సంపాదించుటకు గాని లేక యాత్మసాక్షాత్కారము కొరకు గాని వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధియై యుండవలెను.

భగవంతు డనేక జీవులను సృష్టించినప్పటికి అతనికి సంతుష్టి కలుగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని యవి గ్రహించలేక పోయినవి. అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేకశక్తి నిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుతకార్యములను, బుద్ధిని మెచ్చుకొనునప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి జెంది యానందించెను. అందుచే మానవజన్మ లభించుట గొప్ప యదృష్టము. బ్రాహ్మణజన్మ పొందుట అంతకంటె మేలయినది. అన్నిటికంటె గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయునవకాశము కలుగుట.

మానవుడు యత్నించవలసినది

మానవజన్మ విలువైనదనియు, తుదకు మరణము తప్పదనియు, గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలయును. ఏమాత్రమును అశ్రద్ధగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు త్వరపడవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్యకొర కెంత ఆతురపడునో, కోల్పోయిన యువరాజుకై చక్రవర్తి యెంతగా వెదక యత్నించునో యట్లనే యాత్మసాక్షాత్కారము పొందువరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమొనర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమగుదుము.

నడువవలసిన మార్గము

మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గ మేదన, వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువువద్ద కేగుట. మతసంబంధమైన యుపన్యాసములు వినినప్పటికి పొందనట్టిదియు, మతగ్రంథములు చదివినను తెలియనట్టిదియు నగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నియు కలిసి యివ్వలేని వెలుతురు సూర్యు డెట్లు ఇవ్వగలుగుచున్నాడో యట్లనే మతోపన్యాసములు, మత గ్రంధములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి వైఖరి, సంభాషణలే గుప్తముగా మనకు సలహా నిచ్చును. క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును - మనస్సును స్వాధీన మందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను - వారు అనుసరించునప్పుడు వారి పావనజీవితమునుంచి భక్తులు నేర్చుకొందురు. ఇది భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా యట్టి యోగిపుంగవుడు; సద్గురువు.

బాబా ఫకీరువలె నటించునప్పటికిని వారెప్పుడును ఆత్మానుసంధానమందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గలవారిని, పవిత్రుల నెల్లప్పుడు ప్రేమించుచుండిరి. సుఖములకు ఉప్పొంగువారు కారు. కష్టములవలన క్రుంగిపోవువారు కారు. రాజున్ను, దివాలా తీసిన వాడున్ను బాబాకు సమానమే. తమదృష్టి మాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చేయగలశక్తి యున్నప్పటికి బాబా ఇంటింటికి భిక్షకు పోయేవారు. వారి భిక్ష యెట్టిదో చూతుము.

బాబా యొక్క భిక్షాటనము

షిరిడీజనులు పుణ్యాత్ములు. వారి యిండ్లయెదుట బాబా భిక్షుకుని వలె నిలచి "అక్కా! రొట్టెముక్క పెట్టు" అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు. ఒకచేతిలో తంబిరేలుడొక్కు, ఇంకొక చేతిలో గుడ్డజోలీ పట్టుకొని పోవువారు. ప్రతిరోజు కొన్నియిండ్లకు మాత్రమే పోవువారు. పలుచని పదార్థములు, పులుసు, మజ్జిగ, కూరలు మొదలగునవి డొక్కులో పోసికొనెడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకొనెడివారు. బాబాకు రుచి యనునది లేదు. వారు నాలుకను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్నివస్తువులును డొక్కులోను, జోలెలోను వేసికొనెడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపి తిని సంతుష్టిచెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి యనునది లేనట్లే కాన్పించుచుండెను. బాబా సరిగ 12 గంటలవరకు భిక్ష చేసేవారు. బాబా భిక్షకు కాలపరిమితి లేకుండెను. ఒక్కొక్కదినమందు కొన్ని యిండ్లకు మాత్రమే పోయెడి వారు. సాధారణముగా 12 గంటలవరకు భిక్షచేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమే వారు కారు. మసీదు తుడిచి శుభ్రముచేయు స్త్రీ 10, 12 రొట్టెముక్కలను నిరాటంకముగా తీసికొనుచుండెడిది. కుక్కలను, పిల్లులను, కలలోగూడా యడ్డుపెట్టనివారు, ఆకలిబాధతో నున్న మానవులకు భోజనము పెట్టుట మానుదురా? ఆయన జీవితము మిగుల పావనమైనది.

మొదట షిరిడీ ప్రజలు బాబాను పిచ్చిఫకీరని పిలిచెడివారు. ఎవరయితే భోజనోపాధికై గ్రామములో రొట్టెముక్కలపై నాధారపడుదురో అట్టివారు గౌరవింపబడుదురా? వారి మనస్సు, చేయి ధారాళమయినవి, ధనాపేక్షలేక దాక్షిణ్యము చూపువారు. బయటికి చంచలముగ సుస్థిరత్వములేని వారుగ గాన్పించినను లోన వారు స్థిరమనస్సు గలవారు. వారి మార్గము తెలియరానిది. అంత చిన్న గ్రామములో కూడ దయార్ద్రహృదయులును, వవిత్రులును కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించిరి. అట్టివారి విషయమొకటి యిచ్చట చెప్పుచున్నాను.

బాయిజాబాయి గొప్ప సేవ

తాత్యాకోతే పాటీలు తల్లిపేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకొని, యడవిలో బాబా తపస్సు చేయుచున్నచోటికి బోయి బాబాకు భోజనము పెట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైళ్ళకొలది ముండ్లు, పొదలు దాటి బాబాను వెదికి పట్టుకొని, సాష్టాంగనమస్కారము చేయుచుండెను. ఫకీరు నెమ్మదిగా కదలక మెదలక ధ్యానము చేయుచుండువాడు. ఆమె బాబా యెదుట విస్తరొకటి వేసి భోజన పదార్థములు, రొట్టె, కూర మొదలగునవి పెట్టి బాబాను బలవంతముచేసి తినిపించుచుండెను. ఆమె భక్తివిశ్వాసములు చిత్రమైనవి. ప్రతిరోజు అడవిలో 12 గంటలకు మైళ్ళకొలది నడచి బాబాను వెదకి పట్టుకొని భోజనము చేయమని బలవంతము చేయుచుండిరి. ఆమె సేవను బాబా మహాసమాధి యగునంతువరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటీలునకు బాబా రోజు ఒక్కంటికి రూ. 25/- కానుకగా నిచ్చుచుండెను. తల్లికొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనెడి విశ్వాసముండెను. బాబా ఫకీరు పదవియే శాశ్వతమగు రాజత్వమనియు, లోకులనుకొనే ధనము వట్టి బూటకమనియు చెప్పుచుండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా యడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయువారు. అప్పటినుంచి పొలములో తిరుగు కష్టము బాయజాబాయికి తప్పినది.

ముగ్గురు - పడక స్థలము

యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్ములు. వారి హృదయమందు వాసుదేవుడు వసించును. వారి సహవాసము లభించు భక్తులు గొప్ప యదృష్టవంతులు. అట్టివారిద్దరు; తాత్యాకోతే పాటీలు, మహళ్సాపతి. బాబా వారిని సమానముగా ప్రేమించువారు. ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి ఒకరి కాళ్లు ఒకరికి మధ్య తగులునట్లు నిద్రించుచుండిరి. ప్రక్కలు పరచుకొని, వానిపై చితికిలపడి సగమురేయివరకు ఏవో సంగతులు మాట్లాడుకొనుచుండిరి. అందులో నెవరైన పండుకొన్నట్లు గాన్పించిన తక్కినవారు వారిని లేవగొట్టుచుండిరి. తాత్యాపండుకొని గుఱ్ఱుపెట్టినచో బాబా వానిని యటునిటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. మహాళ్సాపతిని కౌగలించుకొని, కాళ్ళు నొక్కి వీపు తోమేవారు. ఈ విధముగా 14 సం।।లు తాత్యాతల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకొనెను. అవి మరపురాని సంతోషదినములు. బాబా ప్రేమకటాక్షములు కొలువరానివి; ఇంతయని చెప్పుటకు వీలులేనివి. తండ్రి చనిపోయిన పిమ్మట తాత్యాయింటి యజమాని యగుటచే నింటిలోనే నిద్రించుట ప్రారంభించెను.

రాహాతా నివాసి కుశాల్ చంద్

షిరిడీలోని గణపతికోతే పాటీలను వానిని బాబా ప్రేమించువారు. అంతటి ప్రేమతోనే రాహాతా నివాసియగు చంద్రభాను శేట్ మార్వాడీని జూచుచుండెను. ఈ శేట్ చనిపోయిన పిమ్మట వాని యన్న కొడుకగు కుశాల్చందును గూడ మిక్కిలి ప్రేమతో జూచుచు రాత్రింబగళ్ళు వాని క్షేమ మడుగుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, ఇంకొకప్పు డెద్దులబండి మీద బాబా తన ప్రియభక్తులతో రాహాతా పోవువారు. రాహాతా ప్రజలు బాజాభజంత్రీలతో బాబాను గ్రామసరిహద్దు ద్వారమువద్ద కలిసి సాష్టాంగనమస్కారములు చేసేవారు. గొప్పవైభవముతో బాబాను గ్రామములోనికి తీసికొని వెళ్ళేవారు. కుశాల్ చందు బాబాను తన యింటికి తీసికొనిపోయి తగిన యాసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టెడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదముగాను, ఉల్లాసముగాను మాట్లాడెడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండువారు.

షిరిడీ; రాహాతాకు, దక్షిణమున నీమ్గాంకు ఉత్తరదిశయందు మధ్యనున్నది. ఈ రెండు గ్రామములు విడిచి బాబా యెన్నడు ఎచ్చటికి పోయియుండలేదు. రైలుబండి చూచి యుండలేదు. దానిపై ప్రయాణము చేసి యెరుగరు. కాని బండ్ల రాకపోకలు సరిగా తెలిసి యుండెడివారు. బాబా సెలవు పుచ్చుకొని వారి యాజ్ఞానుసారము ప్రయాణము చేయువారల కేకష్టము లుండెడివికావు. బాబా యాజ్ఞకు వ్యతిరేకముగ పోవువారనేక కష్టములపాలగుచుండిరి. ఈ వృత్తాంతము ఇంకను ఇతరవిషయములు వచ్చే యధ్యాయములో చెప్పెదను.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

Chapter 9

శ్రీ సాయి సత్ చరిత్రము
తొమ్మిదవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 9

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

తొమ్మిదవ అధ్యాయము

బాబావద్ద సెలవు పుచ్చుకొనునప్పుడు వారి యాజ్ఞను పాలించవలెను. వారి యాజ్ఞకు వ్యతిరేకముగా నడచిన ఫలితములు; కొన్ని ఉదాహరణలు; భిక్ష, దాని యావశ్యకత; భక్తుల యనుభవములు.

షిరిడీ యాత్రయొక్క లక్షణములు

బాబా యాజ్ఞలేనిదే యెవరును షిరిడీ విడువ లేకుండిరి. బాబా యాజ్ఞకు వ్యతిరేకముగా పోయినచో ననుకొనని కష్టములు వచ్చుచుండెడివి. బాబా యాజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చుచుండెడివారు. ఈ సలహాప్రకారము నడచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి యుదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను.

తాత్యాకోతే పాటీలు

ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్ గాం సంతకు వెళ్ళుచుండెను. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్ గాం సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా యిట్లనెను. "తొందర పడవద్దు. కొంచెమాగుము. సంత సంగతి యటుండనిమ్ము. పల్లెవిడిచి బయటకు పోవలదు." అతని యాతురతను జూచి "మాధవరావు దేశపాండేనయిన వెంట దీసికొని పొమ్మ"ని బాబా యాజ్ఞాపించెను. దీనిని లెక్క చేయక తాత్యా వెంటనే టాంగాను వదిలెను. రెండు గుర్రములలో నొకటి క్రొత్తది; మిక్కిలి చురుకైనది. అది రూ.300ల విలువ జేయును. సావుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరుగెత్తెను. కొంతదూరము పోయిన పిమ్మట కాలు బెణికి యది కూలబడెను. తాత్యాకు పెద్దదెబ్బ తగులలేదు. కాని తల్లి ప్రేమగల బాబా యాజ్ఞను జ్ఞప్తికి దెచ్చుకొనెను. ఇంకొకప్పుడు కోల్హారు గ్రామమునకు పోవునపుడు బాబా యాజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదమును పొందెను.

ఐరోపాదేశపు పెద్దమనిషి

బొంబాయనుండి ఐరోపాదేశపు పెద్దమనిషి యొకడు షిరిడీ వచ్చెను, నానా సాహెబు చాందోర్కరు వద్దనుంచి తననుగూర్చి బాబాకు ఒక లేఖను తీసికొని యేదో ఉద్దేశముతో షిరిడీకి వచ్చెను. అతనికి ఒక గుడారములో సుఖమైన బస యేర్పరచిరి. అతడు బాబా పాదములకు నమస్కరించి వారిచేతిని ముద్దిడవలెనని మూడుసారులు మసీదులో ప్రవేశించ యత్నించెను. కాని బాబా అతనిని నిషేధించెను. క్రింద బహిరంగావరణములో కూర్చుండియే దర్శించవలెననిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడువవలెనని నిశ్చయించెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కినవారు కూడ అట్లనే సలహా ఇచ్చిరి. వారి సలహాలకు వ్యతిరేకముగా అతడు టాంగాలో బయలుదేరెను. ప్రప్రథమమున గుర్రములు బాగుగనే పరుగెత్తినవి. సావుల్ బావి దాటిన వంటనే యొక త్రొక్కుడుబండి ఎదురు వచ్చెను. దానిని జూచి గుర్రములు బెదిరి త్వరగా పరుగిడ సాగెను. టాంగా తలక్రిందులయ్యెను. పెద్దమనిషి క్రిందబడి కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసికొనుటకై కోపర్ గాం ఆసుపత్రిలో పడియుండెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు బాబా యాజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా పొవుదురనియు జనులు గ్రహించిరి.

భిక్షయొక్క యావశ్యకత

బాబాయే భగవంతుడయినచో వారి భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేల? యను సందియము చాలామందికి కలుగవచ్చును. ఈ ప్రశ్నకు రెండు దృక్కోణములతో సమాధానము చెప్పవచ్చును. (1) భిక్షాటనముచేసి, జీవించుట కెవరికి హక్కు కలదు? (2) పంచసూనములు, వానిని పోగొట్టుకొను మార్గమేది? యను ప్రశ్నలకు సమాధానము చెప్ప వచ్చును.

సంతానము, ధనము, కీర్తి సంపాదించుటయం దాపేక్ష వదలుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవింపవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటివద్ద వంట ప్రయత్నములు చేసికొని, తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థుడు కాడు; వానప్రస్థుడు కూడ కాడు. వారస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యమునుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ జగత్తు వారి గృహమని వారి నమ్మకము. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడియున్నది. వారు పరబ్రహ్మస్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటనము చేయు హక్కు సంపూర్ణముగా కలదు.

పంచసూనములు, వానిని తప్పించుకొను మార్గమును ఆలోచింతము. భోజనపదార్థములు తయారు చేయుటకు గృహస్థులు అయిదు పనులు తప్పక చేయవలెను. అవి యేవన, 1. దంచుట, రుబ్బుట 2. విసరుట 3. పాత్రలు తోముట, 4. ఇల్లు ఊడ్చుట తుడుచుట, 5. పొయ్యి యంటించుట. ఈ అయిదు పనులు చేయునప్పు డనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపము ననుభవించవలెను. ఈ పాపపరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచున్నవి. 1. బ్రహ్మయజ్ఞము, 2. వేదాధ్యయనము, 3. పితృయజ్ఞము, 4. దేవయజ్ఞము, 5. భూతయజ్ఞము, 6. అతిథియజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్షసాధనమునకు ఆత్మసాక్షాత్కారమున కివి తోడ్పడును. బాబా యింటింటికి వెళ్ళి భిక్ష యడుగుటచే, ఆయింటిలోనివారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి దెచ్చుచుండెను. తమ ఇంటి గుమ్మము వద్దనే యింత గొప్ప సంగతి బాబా బోధించుటవలన షిరిడీ ప్రజలెంతటి ధన్యులు!

భక్తుల యనుభవములు

ఇంకొక సంతోషదాయకమగు సంగతి. శ్రీకృష్ణుడు భగవద్గీత (9అ. 26శ్లో.) యందిట్లు నుడివెను. శ్రద్ధాభక్తులతో ఎవరైన పత్రముగాని పుష్పముగాని ఫలముగాని లేదా నీరుగాని యర్పించినచో దానిని నేను గ్రహించెదను. తనభక్తు డేదైన సమర్పించినచో దానిని నేను గ్రహించెదను. తనభక్తు డేదైన సమర్పించవలెననుకొని మరచినచో అట్టివానికి బాబా జ్ఞాపకము చేసి, అయర్పితమును గ్రహించి యాశీర్వదించువారు. అట్టివి కొన్ని యీ క్రింద చెప్పిన యుదాహరణలు.

తర్ ఖడ్ కుటుంబము (తండ్రి, కొడుకు)

రామచంద్ర ఆత్మారామ్ పురఫ్ బాబాసాహెబు తర్ ఖడ్ యొకా నొకప్పుడు ప్రార్థనసమాజస్థుడైనను బాబాకు ప్రియభక్తుడు. వాని భార్యాపుత్రులు కూడ బాబాను మిగుల ప్రేమించుచుండిరి. తల్లితో కూడ కొడుకు షిరిడీకి పోయి యచ్చట వేసవిసెలవులు గడుపవలెనని నిర్ణయించిరి. కాని కొడు కిష్టపడలేదు. కారణ మేమన తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడగుటచే ఇంటివద్ద బాబాయెక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కాని తండ్రి, పూజను సక్రమముగా చేసెదనని వాగ్దానము చేయుటచే బయలుదేరెను. అందుచే శుక్రవారము రాత్రి తల్లి, కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి.

ఆ మరుసటిదినము శనివారమునాడు తండ్రియగు తర్ఖడ్ త్వరగా లేచి, స్నానముచేసి, పూజను ప్రారంభించుటకు పూర్వము బాబా పటమునకు సాష్టాంగనమస్కారము చేసి లాంఛనమువలె కాక కొడుకు చేయునట్లు పూజను సక్రమముగా నెరవేర్చెదనని ప్రార్ధించెను. ఆనాటి పూజను సమాప్తిచేసి నైవేద్యము నిమిత్తము కలకండను అర్పించెను. సమయమందు దానిని పంచిపెట్టెను.

ఆనాటి సాయంత్రము, మరుసటిదినము ఆదివారము పూజయంతయు సవ్యముగా జరిగెను. దానికి మరుసటిదినము సోమవారము కూడ చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజచేసియుండలేదు. పూజయంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారమునాడు పూజనెప్పటివలె సలిపి కచేరికి పోయెను. మధ్యాహ్నభోజనమునకు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదము లేకుండెను. నౌకరును అడుగగా, ఆనాడు ప్రసాదమర్పించుట మరచుటచే లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగనే సాష్టాంగనమస్కారము చేసి, బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందకు నిందించెను. ఈ సంగతులన్నిటిని షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుమనెను. ఇది బాంద్రాలో మంగళవారము 12 గంటలకు జరిగెను.

అదే సమయమందు మధ్యాహ్మహారతి ప్రారంభించుటకు సిద్ధముగా నున్నప్పుడు, బాబా యాత్మారాముని భార్యతో "తల్లీ! బాంద్రాలో మీ యింటికి ఏమయిన తినే ఉద్దేశముతో పోయినాను. తలుపు తాళమువేసియుండెను. ఏలాగుననో లోపల ప్రవేశించితిని. కాని తినుట కేమిలేక తిరిగి వచ్చితిని" అనెను.

అమెకు బాబా మాటలు బోధపడలేదు. కాని ప్రక్కనేయున్న కుమారుడు ఇంటివద్ద పూజలో నేమియో లోటుపాటు జరిగినదని గ్రహించి యింటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా నిరాకరించెను. కాని పూజను అక్కడనే చేయుమనెను. కొడుకు వెంటనే తండ్రికి షిరిడీలో జరిగినదాని నంతటిని వ్రాసెను. పూజను తగిన శ్రద్ధతో చేయుమని వేడుకొనెను.

ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమతమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరము కదా!

ఆత్మారాముని భార్య

అత్మారాముని భార్యవిషయ మాలోచింతుము. ఆమె మూడు వస్తువులను నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను. 1. వంకాయ పెరుగు పచ్చడి, 2. వంకాయ వేపుడుకూర, 3. పేడా. బాబా వీనినెట్లు గ్రహించెనో చూచెదము.

బాంద్రా నివాసియగు రఘువీరభాస్కరపురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్దవంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి యొక వంకాయతో పెరుగుపచ్చడిని రెండవదానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసికొని వెళ్ళెను. బాబాకాపచ్చడి చాల రుచిగా నుండెను. కాన దాని నందరికి పంచిపెట్టెను. బాబా వంకాయ వేపుడు కూడ అప్పుడే కావలెననెను. ఈ సంగతి రాధాకృష్ణమాయికి తేలియపరచిరి. అది వంకాయల కాలము కాదు గనుక యామెకేమియు తోచకుండెను. వంకాయ లెట్లు సంపాదించుట యనునది ఆమెకు సమస్యయాయెను. వంకాయపచ్చడి తెచ్చిన దెవరని కనుగొనగా పురందరుని భార్యయని తెలియుటచే వంకాయవేపుడు గూడ ఆమెయే చేసిపెట్టవలెనని నిశ్చయించిరి. ఆప్పుడందరికి బాబా కోరిన వంకాయవేపుడుకు గల ప్రాముఖ్యము తెలిపినది. బాబా సర్వజ్ఞుడని యందరాశ్చర్యపడిరి.

1915 డిసెంబరులో గోవింద బలరామ్ మంకడ్ యనువాడు షిరిడీ పోయి తనతండ్రికి ఉత్తరక్రియలు చేయవలె ననుకొనెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారామునివద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబాకొరకేమైన పంపవలె ననుకొనెను. ఇల్లంతయు వెదకెను. కాని యొక్క పేడా తప్ప యేమియు గన్పించలేదు. ఈ పేడా యప్పటికే బాబాకు నైవేద్యము పెట్టియుండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై యుండెను. కాని ఆమె బాబాయందున్న భక్తిప్రేమలచే యాపేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను. గోవిందుడు షిరిడీ చేరెను. బాబాను దర్శించెను. పేడా తీసికొనివెళ్ళుట మరచెను. బాబా ఊరకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినపుడు కూడ పేడా తీసికొని పోవుట మరచెను. అప్పుడు బాబా యోపికపట్టక తనకొర కేమి తెచ్చినావని యడిగెను. ఏమియు తీసికొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, "నీవు యింటివద్ద బయలుదేరునప్పుడు అత్మారాముని భార్య నాకొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా?" యని యడిగెను. కుర్రవాడదియంతయు జ్ఞప్తికిదెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరుగెత్తి పేడాను దెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మ్రింగెను. ఇవ్విధముగా ఆత్మారాముని భార్య యెక్క భక్తిని బాబా మెచ్చుకొనెను". నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసెదను". అను గీతావక్యము (౪-౧౧ 4-11) నిరూపించెను.

బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట యెట్లు?

ఒకప్పుడు ఆత్మారుముని భార్య షిరిడీలో నొక ఇంటియందు దిగెను. మధ్యాహ్నభోజనము తయారయ్యెను. అందరికి వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క యొకటి వచ్చి మొఱుగుట ప్రారంభించెను. వెంటనే తర్ఖడ్ భార్యలేచి యొక రొట్టెముక్కను విసరెను. ఆకుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా యిట్లనెను". తల్లీ! నాకు కడుపునిండ గొంతువరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడు ఇట్లనే చెయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో గూర్చుండి నేనెన్నడసత్యమాడను. నాయందట్లే దయ యుంచుము. మొదట యాకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము". ఇదంతయు ఆమెకు బోధపడలేదు. కావున ఆమె యిట్లు జవాబిచ్చెను. 'బాబా! నేను నీ కెట్లు భోజనము పెట్టగలను? నా భోజనముకొర కితరులపై ఆధారపడి యున్నాను. నేను వారికి డబ్బిచ్చిభోజనము చేయుచున్నాను.' అందులకు బాబా యిట్లు జవాబిచ్చెను". నీ విచ్చిన ప్రేమపూర్వకమైన యా రొట్టెముక్కను తిని యిప్పటికి త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకుపూర్వ మేకుక్కను నీవు జూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటియే. అట్లనే, పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియు నా యంశములే. నేనే వాని యాకారములో తిరుగుచున్నాను. ఎవరయితే జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి యింకొకటి యను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము". ఈ యమృతతుల్యమగు మాటలు విని యామె మనస్సు కరగెను. ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకొనిపోయెను. ఆమె యానందమునకు అంతులేకుండెను.

నీతి

'భగవంతుని జీవులన్నిటియందు గనుము' అనునది యీ యధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవి యన్నియు భగవంతుని ప్రతిజీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ యధ్యాయము చివర చెప్పిన యుదాహరణమునను ఇతరానేకముల మూలమునను, సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధలను, ఆచరణరూపమున నెట్లుంచవలెనో యనుభవపూర్వకముగా నిర్థారణచేసి యున్నారు. ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను భోధించు చక్కని గురువని మనము గ్రహించవలెను.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।