Wednesday, 21 September 2016

Chapter 49

శ్రీ సాయి సత్ చరిత్రము
నలుబదితొమ్మిదవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 49

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదితొమ్మిదవ అధ్యాయము

1. హరి కానోబా, 2. సోమదేవ స్వామి, 3. నానాసాహెబు చాందోర్కరు - కథలు

తొలిపలుకు

వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మావంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కాని సాయిబాబా సుగుణములను జూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులుగాని, బంధువులుగాని మనతో లేకున్నచో, మంచి పిండివంటలు కూడా రుచింపవు. కాని వారు మనతో నున్నచో ఆ పిండివంటలు మరింత రుచికరము లగును. సాయి లీలామృతము కూడ అట్టిదే. దీనిని మన మొంటరిగా తినలేము, స్నేహితులు, బంధువులు కలసినచో చాల బాగుగా నుండును.

ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి యిష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారకి సర్వస్యశరణాగతి యొనర్చి వారి యందే ధ్యానము నిలుపుట మాకర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దాక్షములకంటె తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట, తపస్సు కంటె మేలు. సద్గురుని ధ్యానించుట యన్నింటికంటె మేలయినది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు, వారి యాకారమును మనస్సున భావించుకొనుచు, వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో, వారికొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసారబంధమునుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో, సాయి తప్పనిసరిగ మనకు సహాయము చేయును. తుదకు మోక్షము నిచ్చును. ఇక నీయధ్యాయములోని కథలవైపు మరలుదము.

హరి కానోబా

హరి కానోబా యను బొంబాయి పెద్దమనుష్యుడొకడు తనస్నేహితులవల్ల, బంధువులవల్ల బాబాలీల లనేకములు వినెను, కాని నమ్మలేదు. కారణమేమన అతనిది సంశయస్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలెనని యతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారుపాగ యుండెను. అతని పాదములకు కొత్తచెప్పులుండెను. కొంతదూరమునుండి బాబాను చూచి బాబావద్దకు బోయి సాష్టాంగనమస్కారము చేయవలె ననుకొనెను. క్రొత్తచెప్పులెచ్చట నుంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదుముందొక మూలన బెట్టి బాబా దర్శనమునకు బోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి, ఊదిని, ప్రసాదమును బాబాచేతి నుండి యందుకొని తిరిగివచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పులకొరకు వెదకెను కాని నిష్ప్రయోజనమయ్యెను. చాలా చీకాకు పడుచు బసకు వచ్చెను.

అతడు స్నానము చేసి, పూజ చేసి, నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కాని, తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము, చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తనవైపు వచ్చుట చూచెను.

ఆ కుర్రవాని చేతిలో నొక కర్రయుండెను. దాని చివరకు క్రొత్తచెప్పులజత వ్రేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చినవారితో అతడు బాబా తనను బంపెననియు, వీధిలో 'హరీ కా బేటా, జరీ కా పేటా' యని యరచుమనియు చెప్పెననెను. ఎవరయిన ఆ చెప్పులు తమవే యన్నచో నతని పేరు హరి యనియు, నతడు కానోబా కొడుకనియు, అతనితలపై జరీపాగా గలదా యను సంగతి పరీక్షించిన తరువాత చెప్పుల నిచ్చి వేయుమని చెప్పెననెను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని, హరి కానోబా యాశ్చర్యానందములు పొందెను. కుర్రవానివద్దకు బోయి చెప్పులు తనవని రూఢి చేసెను. అతడు తన పేరు హరి యనియు, తాను కానోబా కుమారుడననియు తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తిజెంది చెప్పుల నిచ్చివేసెను. హరి కానోబా మిక్కిలి యాశ్చర్యపడెను. తన జల్తారుపాగ యందరికి కనిపించవచ్చునుగాని, తన పేరు, తన తండ్రిపేరు బాబా కెట్లు దెలిసెను? అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అత డచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయమువల్ల నాతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగ నెరవేరెను, సంతోషముతో నింటికి పోయెను.

సోమదేవస్వామి

బాబాను పరీక్షించుటకై యింకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబు దీక్షిత్ తమ్ముడు భాయాజీ నాగపూరులో నివసించుచుండెను. 1906వ (౧౯౦౬) సంవత్సరములో హిమాలయములకు బోయినపుడు సోమదేవ స్వామి యను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో గలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి. ఐదు సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి భాయాజీ యింట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టికోరిక గలిగెను. భాయాజీ వద్దనుంచి పరిచయము ఉత్తరమును దీసికొని షిరిడీకి పోయెను. మన్మాడు, కోపరగాం దాటిన పిమ్మట టాంగా చేసికొని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోను, వేర్వేరు జీవనపద్ధతులతోను, వేర్వేరు బాహ్యాలంకారములతోను ఉందురు. కాని యీ పై పై గుర్తులనుబట్టి యే యోగియొక్క గొప్పదనమును గనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంథాగా దోచెను. రెండు పతాకము లెగురుట చూడగనే తానిట్లనుకొనెను. "ఈ యోగి జండాలయందేల మక్కువ జూపవలెను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తికొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది" అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని, షిరిడీకి పొవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న యితర యాత్రికులకు జెప్పెను. వారతనితో నిట్లనిరి. "అట్లయిన ఇంత దూరము వచ్చితి వేల?" జండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో, షిరిడీలో రథము, పల్లకి, గుఱ్ఱము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు?" సోమదేవస్వామి గాభరపడి యిట్లనెను. "గుఱ్ఱములతోను, పల్లకీలతోను, జట్కాలతోను గల సాధువులను నేనెచ్చట జూచి యుండలేదు. అట్టి సాధువులను చూచుటకంటె తిరిగిపోవుటయే మేలు" అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్థమయ్యెను. తక్కిన తోడి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీ లోనికి బొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమనిరి. బాబా యా జండాలను కాని తక్కిన వస్తువులనుగాని ఆడంబరములనుగాని కీర్తినిగాని లక్ష్యపెట్టనివారని చెప్పిరి. అవన్నియు నలంకరించినవారు బాబా భక్తులేగాని ఆయనకేమి యవసరముగాని సంబంధముగాని లేదనిరి. వారి భక్తి ప్రేమలకొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు జేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువనుంచి బాబాను దర్శించగనే అతని మనస్సు కరగెను. అతని కండ్లు నీటితో నిండెను; గొంతుక యార్చుకొనిపోయెను. "ఎచ్చట మనస్సు శాంతించి యానందమును పొంది యాకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము" అని తన గురువు చెప్పినదానిని జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనముకొరకు దగ్గరకు పోగా "మా వేషము మా దగ్గరనే యుండనీ, నీ యింటికి నీవు పొమ్ము. తిరిగి మసీదుకు రావద్దు. ఎవరయితే మసీదుపై జండా నెగురవైచుచున్నారో యట్టివారి దర్శనము చేయనేల? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమయిన ఉండవద్దు" అనెను. ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నాడని తెలిసికొనెను. అతడెంత సర్వజ్ఞుడు! తాను తెలివితక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా కొందరిని కౌగిలించుకొనుట, కొందరిని యాశీర్వదించుట, కొందరిని యోదార్చుట, కొందరివైపు దాక్షిణ్యముతో జూచుట, కొందరివైపు చూచి నవ్వుట, ఊదీప్రసాదమును కొందరి కిచ్చుట, యిట్లు అందరిని ఆనందింపజేసి, సంతృప్తి పరచుట జూచి తన నొక్కరినే యేల యంత కఠినముగా జూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీక్షణముగా నాలోచించి బాబా చేయునదంతయు తన యంతరంగముననున్న దానితో సరిగా నుండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్థిపొందుటకు యత్నింపవలెనని గ్రహించెను. బాబా కోపము మారురూపముతో నున్న యాశీర్వాదమే యనుకొనెను. కొన్నాళ్ళ పిమ్మట బాబాయందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను.

నానా సాహెబు చాందోర్కరు

ఈ అధ్యాయమును హేమండ్ పంతు నానాసాహెబు చాందోర్కరు కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబు మసీదులో మహాళ్సాపతి మొదలగువారితో కూర్చొని యుండగా, బీజీపూరునుండి ఒకమహమ్మదీయుడు కుటుంబముతో బాబాను జూచుటకు వచ్చెను. అతనితో గోషా స్త్రీ లుండుటచే నానాసాహెబు అచ్చటనుంచి లేవనెంచెను. కాని బాబా యాతని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసికొనిరి. అందులో నొక స్త్రీ ముసుగు దీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసికొనెను. నానాసాహెబు ఆమె ముఖసౌందర్యమును చూచి మరలమరల చూడగోరెను. నానాయొక్క చాంచల్యమును జూచి, స్త్రీలు వెళ్ళి పోయిన పిమ్మట, బాబా నానాతో నిట్లనెను. "నానా! అనవసరముగా చీకాకు పడుచుంటి వేల? ఇంద్రియములను వాని పనులను జేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగ జేసికొన గూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు గాన అందరిని చూచి సంతసించుట మన విధి. క్రమముగాను, మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరచియుండగా, వెనుక ద్వారము గుండా పోనేల? మన హృదయము స్వచ్ఛముగా నున్నంతవరకు, నేమియు దోషము లేదు. మనలో చెడ్డ యాలోచన లేనప్పుడితరులకు భయపడనేల? నేత్రములు వానిపని యవి నెరవేర్చు కొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేల?"

శ్యామా యచ్చటనే యుండెను. కాని బాబా చెప్పినదానిని గ్రహించలేక పోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామా ఆ విషయమై నానా నడిగెను. ఆ చక్కని స్త్రీవైపు జూచి తాను పొందిన యా చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి యెట్లు సలహా నిచ్చెనో వివరించెను. బాబా చెప్పినదాని భావము నానా యిట్లు చెప్ప దొడంగెను. "మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరమును స్వాధీనమునం దుంచుకొనవలెను. దాని యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయములవైపు పరుగెత్తును. కాని, మనము వానివెంట పోరాదు. మనము ఆ విషయములను కోరగూడదు. క్రమముగాను, నెమ్మదిగాను, సాధన చేయుటవలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడగూడదు. కాని వానిని మనము పూర్తిగ స్వాధీనమం దుంచుకొనలేము. సమయానుకూలముగా వాని నణచి సరిగా నుంచుకొనుచుండవలెను. నేత్రములందమైనవానిని జూచుటకొరకే యివ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని, లజ్జకుగాని యవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా నింద్రియములను సులభముగాను, సహజముగాను స్వాధీనము చేసికొనవచ్చును. విషయము లనుభవించుటలో కూడ నీవు భగవంతుని జ్ఞప్తియందుంచుకొనెదవు. బాహ్యేంద్రియముల మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయములవైపు పరుగిడనిచ్చినచో, వానిపై అభిమాన ముండనిచ్చినచో, చావుపుట్టుకల చక్రమునశింపదు. ఇంద్రియవిషయములు హానికరమయినవి. వివేకము (అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట) సారథిగా, మనస్సును స్వాధీనమందుంచుకొన వలెను. ఇంద్రియముల నిచ్చవచ్చినట్లు సంచరింప జేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేర గలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన యావాసము. అచటనుండి తిరిగి వచ్చుటలేదు."

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

No comments:

Post a Comment