16, 17 అధ్యాయములు
Shri Sai Satcharitra - Chapters 16 & 17
ఓం
శ్రీ సాయి నాథాయ నమః
శ్రీ
సాయిబాబా
జీవిత చరిత్రము
16, 17 అధ్యాయములు
(మూడవ రోజు పారాయణ - శనివారము)
గత అధ్యాయములో చోల్కరు తన మ్రొక్కు నెట్లు చెల్లించెనో బాబా దాని నెట్లు ఆమోదించెనో చెప్పితిమి. ఆ కథలో ఏ కొంచమైనను భక్తి ప్రేమలతో నిచ్చినదానిని ఆమోదించెదననియు గర్వముతోను, అహంకారముతోను, ఇచ్చిన దానిని తిరస్కరించెదననియు బాబా నిరూపించెను. బాబా పూర్ణ సత్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేవారు కారు. ఎవరైన భక్తి ప్రేమలతో నేదైన సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనెడివారు. నిజముగా సద్గురుసాయికంటె నుదారస్వభావులు, దయార్ద్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు, వారికి సమానము కావు. మనము కోరినదెల్ల నిచ్చు కామధేనువు కూడ బాబాతో సమానము కాదు. ఏలన, యవి మనము కోరునవి మాత్రమే యిచ్చును. కాని సద్గురువు అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను. ఆ కథ యిచ్చట చెప్పుదును.
సకలైశ్వర్యముల ననుభవించుచున్న ధనికు డొకడుండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలమును, తోటలను సంపాదించెను. వాని కనేక మంది సేవకు లుండెడివారు. బాబా కీర్తి వాని చెవుల పడగనే షిరిడీకి పోయి బాబా పాదములపై బడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనెదనని తన స్నేహితునితో చెప్పెను. స్నేహితుడిట్లనెను. "బ్రహ్మజ్ఞానమును సంపాదించుట సులభమైనపని గాదు. ముఖ్యముగా నీవంటి పేరాశగల వానికి మిగుల దుర్లభము. ధనము, భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీవంటి వానికి బ్రహ్మజ్ఞానము నెవరిచ్చెదరు? నీవొక పైసయయిన దానము చేయనివాడవే! నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదకునపుడు నీ కోరిక నెరవేర్చువారెవరు?"
తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక, రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీ వచ్చెను. మసీదుకుపోయి, బాబాను జూచి వారి పాదములకు సాష్టాంగనమస్కారము చేసి యిట్లనెను. "బాబా! ఇక్కడకు వచ్చినవారికి ఆలస్యము చేయక బ్రహ్మమును జూపెదరని విని నేనింతదూరమునుండి వచ్చితిని. ప్రయాణముచే నేను మిక్కిలి బడలితిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును". బాబా యిట్లు బదులు చెప్పెను. "నా ప్రియమైన స్నేహితుడా! ఆతురపడవద్దు. నిప్పుడే నీకు బ్రహ్మమును జూపెదను. నా బేరమంతయు నగదే కాని, యరువు కాదు. అనేకమంది నావద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగనివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే యడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము నివ్వుమని యడుగువారు చాల తక్కువ. ప్రపంచ విషయములు కావలెనని యడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థికమై యోచించువారు మిక్కిలి యరుదు. కావున నీవంటివారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలెనని యడుగుసమయము శుభమైనది; శ్రేయదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించినవాని నన్నిటిని జూపెదను."
ఇట్లని బాబా వానికి బ్రహ్మమును జూపుటకు మొదలిడెను. వాని నక్కడ కూర్చుండుమని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పటి కాతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేసెను. ఒక బాలుని బిలచి నందుమార్వాడి వద్దకు బోయి 5 రూ. బదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగివచ్చి, నందు ఇంటివద్ద లేడనియు వాని యింటి వాకిలికి తాళము వేసి యున్నదనియు చెప్పెను. కిరాణదుకాణుదారు బాలావద్దకు పోయి యప్పు తెమ్మని బాబా యనెను. ఈసారి కూడ కుర్రవాడు వట్టిచేతులతో తిరిగివచ్చెను. ఇంతకిద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితము లేకపోయెను.
సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మవతారమేయని మనకు తెలియును. అయినచో 5 రూ.లు అప్పు చేయవలసిన యవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో నేమి పనియని ఎవరైన అడుగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా యింటివద్ద లేరని వారికి తెలిసియే యుండును. ఇది యంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చినవాని కొరకై జరిపి యుందురు. ఆ పెద్దమనిషి వద్ద నోటులకట్ట యుండెను. అతనికి నిజముగా బాబా వద్దనుండి బ్రహ్మజ్ఞానము కావలసి యున్నచో, బాబా యంత ప్రయాసపడుచున్నప్పు డత డూరకనే కూర్చుండడు. బాబా యా పైకమును తిరిగి యిచ్చివేయునని కూడ వానికి తెలియును. అంత చిన్నమొత్తమయినప్పటికిని వాడు తెగించి యివ్వలేకపోయెను. అట్టివానికి బాబా వద్దనుంచి బ్రహ్మజ్ఞానము కావలెనట! నిజముగా బాబయందు భక్తిప్రేమలు కలవాడెవడైనను వెంటనే 5 రూపాయలు తీసి యిచ్చియుండునే కాని ప్రేక్షకునివలె ఊరకే చూచి యండడు. ఈ పెద్దమనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞాన మివ్వుమని చీకాకు పరచుచుండెను. అప్పుడు బాబా యిట్లనెను. "ఓ స్నేహితుడా! నేను నడుపుచున్నదాని నంతటిని గ్రహించ లేకుంటివా యేమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును జూచుటకై యిదంతయు జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయ మిది. బ్రహ్మమును జూచుటకు 5 వస్తువులను సమర్పించవలెను. అవి యేవన :- 1. పంచ ప్రాణములు; 2. పంచేంద్రియములు; 3. మనస్సు; 4. బుధ్ధి; 5. అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా యాత్మసాక్షాత్కారమునకు బోవు దారి చాలా కఠినమయినది. అది కత్తివాదరవలె మిక్కిలి పదునైనది."
అట్లనుచు బాబా యీ విషయమునకు సంబంధించిన సంగతులన్నియు జెప్పెను. వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరచితిమి.
బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత
అందరును తమ జీవితములో బ్రహ్మమును జూడలేరు. దానికి కొంత యోగ్యత యవసరము.1. ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమయిన కోరిక
ఎవడయితే తాను బద్దుడనని గ్రహించి బంధనములనుండి విడిపడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతరసుఖఃములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్హుడు.
2. విరక్తి లేదా ఇహపరసౌఖ్యములందు విసుగు చెందుట
ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు జెందినగాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు.
3. అంతర్ముఖత (లోనకు జూచుట)
మన యింద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించియున్నాడు. కనుక మనుష్యు డెప్పుడును బయట నున్న వానిని చూచును. కాని, ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మ నేకధ్యానముతో జూడ వలయును.
4. పాపవిమోచన పొందుట
మనుష్యుడు దుర్మార్గ మార్గమునుండి బుధ్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్ట లేనప్పుడు జ్ఞానముద్వార కూడ ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.
5. సరియయిన నడవడి
ఎల్లప్పుడు సత్యము పలుకుచు, తపస్సు చేయుచు, లోన జూచుచు, బ్రహ్మచారిగ నుండినగాని ఆత్మసాక్షాత్కారము లభించదు.
6. ప్రియమైనవానికంటె శ్రేయస్కరమైనవానిని కోరుట
లోకములో రెండు తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది; రెండవది సంతోషకరమయినది. మొదటిది వేదాంతవిషయములకు సంబంధించినది. రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో నొకదానిని అత డెంచుకొనవలెను. తెలివి గలవాడు, మొదటిదానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవదానిని కోరును.
7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట
శరీరము రథము; ఆత్మ దాని యజమాని; బుద్ధి ఆ రథమును నడుపు సారథి; మనస్సు కళ్ళెము; ఇంద్రియములు గుఱ్ఱములు; ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి యింద్రియములు అస్వాధీనములో (బండి తోలువాని దుర్మార్గపు గుఱ్ఱములవలె) వాడు గమ్యస్థానమును చేరడు. చావుపుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి యింద్రియములు స్వాధీనమందుండునో (బండి నడుపువాని మంచి గుఱ్ఱమువలె) వాడు గమ్యస్థానము చేరును. ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేర గలడు; విష్ణుపదమును చేరగలడు.
8. మనస్సును పావనము చేయుట
మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండ నిర్వర్తించనియెడల నతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే యతడు యాత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము (అనగా సత్యమైనదానిని యసత్యమైనదానిని కనుగొనుట), వైరాగ్యము (అసత్యమైనదానియం దభిమానము లేకుండుట) మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారి తీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడచిపెట్టనిదే, ఆత్మసాక్షాత్కారమున కవకాశము లేదు. నేను శరీరమనుకొనుట గొప్ప భ్రమ. ఈ యభిప్రాయమం దభిమాన ముండుటయే బంధమునకు కారణము. నీ వాత్మసాక్షాత్కారమును కాంక్షించినచో నీ యభిమానమును విడువవలెను.
9. గురువుయొక్క యావశ్యకత
ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరిము గూఢమైనది. ఎవ్వరైనను తమస్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన యింకొకరి (గురువు) సహాయము మిక్కిలి యవసరము. గొప్ప కృషి చేసి, శ్రమించి ఇతరు లివ్వలేనిదాని నతిసులభముగా గురువునుండి పొందవచ్చును. వారా మార్గమందు నడచియున్న వారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతి లో క్రమముగా ఒక మెట్టు మీదినుంచి యింకొక పై మెట్టునకు తీసికొని పోగలరు.
10. భగవంతుని కటాక్షము
ఇది యన్నిటికంటె మిక్కిలి యవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైనవారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరమును తరింపజేయగలడు. వేదము లభ్యసించుట వల్లగాని మేధాశక్తివల్లగాని పుస్తకజ్ఞానము వల్ల గాని యాత్మానుభూతి పొందలేరు. ఆత్మ యెవరిని వరించునో వారే దానిని పొందగలరు". అట్టి వారికే యాత్మ తన స్వరూపమును తెలియజేయు" నని కఠోపనిషత్తు చెప్పుచున్నది.
ఈ ఉపన్యాసము ముగిసిన పిమ్మట బాబా యా పెద్దమనుష్యునివైపు తిరిగి "అయ్యా ! నీ జేబులో బ్రహ్మము యాబదింతలు 5 రూపాయల నోట్ల రూపముతో నున్నది. దయచేసి దానిని బయటకు దీయుము". అనెను, ఆ పెద్దమనుష్యుడు తన జేబునుంచి నోటులకట్టను బయటకు దీసెను. లెక్క పెట్టగా సరిగా 25 పదిరూపాయల నోట్లుండెను. అందరు మిక్కిలి యాశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞత్వమును జూచి వాని మనస్సు కరగెను. బాబా పాదములపై బడి వారి యాశీర్వదమునకై వేడెను. అప్పుడు బాబా యిట్లనెను. "నీ బ్రహ్మపు నోటులకట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాశను, లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై యున్నదో, వాడా యభిమానమును పోగొట్టుకొననంతవరకు బ్రహ్మము నెట్లుపొందగలడు? అభిమానమనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఖఃమను సుడిగుండము వంటిది. అది యసూయ యహంకారమను మొసళ్ళతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరము గలవి.
ఎక్కడ పేరాశగలదో యక్కడ బ్రహ్మముగూర్చి యాలోచించుటకు గాని ధ్యానమునకుగాని తావులేదు. అట్లయినచో పేరాశగల వాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి శాంతి గాని, సంతుష్టిగాని, దృఢనిశ్చయముగాని యుండవు. మనస్సునం దేమాత్రము పేరాశ యున్నను సాధనలన్నియు (ఆధ్యాత్మిక ప్రయత్నములు) నిష్ప్రయోజనములు.
ఎవడయితే ఫలాపేక్షరహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వానియందు విరక్తి లేదో యట్టివాడు గొప్పచదువరి యైనప్పటికి వాని జ్ఞానమెందుకు పనికిరానిది. ఆత్మసాక్షాత్కారము పొందుట కిది వానికి సహాయపడదు. ఎవరహంకారపూరితులో, ఎవరింద్రియ విషయములగూర్చి యెల్లప్పుడు చింతించెదరో, వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమొనర్చుట తప్పనిసరి యవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నియు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన, దానిని వారి కివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను."
ఒక యతిథిని ఇంటికి బిలిచినప్పుడు, ఇంటిలోనివారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులుగూడ అతిథితోపాటు విందులో పాల్గొందురు. కావున నప్పుడు మసీదులో నున్న వారందరు బాబా ఆ పెద్దమనుష్యునకు చేసిన యీ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా యాశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట నున్నవారందరును పెద్దమనిషితోసహ, మిక్కిలి సంతోషముతో సంతుష్టి చెందినవారై వెళ్ళిపోయిరి.
బాబావారి వైశిష్ట్యము
అనేకమంది సన్యాసులు ఇండ్లు విడచి యడవులలోని గుహలలోను, ఆశ్రమములలోను, నొంటరిగా నుండి జన్మరాహిత్యముగాని, మోక్షమునుగాని సంపాదించుటకు ప్రయ్తత్నించెదరు. వారితరులగూర్చి యాలోచించక ఆత్మానుసంధానమందే మునిగియుందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లుగాని, భార్యగాని, సంతానముగాని, బంధువులుగాని లేరు. అయినప్పటికి సమాజములోనే యుండెడివారు. బాబా నాలుగయిదిండ్లనుండి భిక్షచేసి, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనెడివారు. లౌకిక విషయములందు మగ్నులై, ఈ ప్రపంచములో నెట్లు ప్రవర్తించవలయునో జనులకు బోధించెడువారు. ఆత్మసాక్షాత్కారము పొందిన పిమ్మట గూడ ప్రజల క్షేమమునకై పాటుబడు సాధువులు, యోగులు మిక్కిలి యరుదు. సాయిబాబా ప్రజలకై పాటుబడు వారిలో ప్రథమగణ్యులు.కనుక హేమడ్ పంతు ఇట్లు చెప్పెను, "ఏ దేశమునందు ఈ యపూర్వమైన విలువగల పవిత్రరత్నము పుట్టినదో యా దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిరో యదియు ధన్యము. ఏ తల్లి దండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు."
శాంతిః శాంతిః శాంతిః
16, 17 అధ్యాయములు సంపూర్ణము.
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।
No comments:
Post a Comment